మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పార్టీ మారుతున్నట్టుగా కొంతకాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.
మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పార్టీ మారుతున్నట్టుగా కొంతకాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నారని.. త్వరలోనే హస్తం గూటికి చేరనున్నారనేది ఆ ప్రచారం సారాంశం. అయితే తాజాగా ఈ ప్రచారంపై వివేక్ స్పందించారు. తాను బీజేపీని వీడుతున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వివేక్ మంగళవారం తెలిపారు. తాను కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు సోషల్ మీడియాతో కొన్ని మీడియా సంస్థల్లో వేదికగా వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్టుగా చెప్పారు. తాను కాంగ్రెస్ నేతలతో టచ్‌లో లేనని చెప్పారు.
‘‘నేను కాంగ్రెస్ నాయకులతో టచ్‌లో లేను. కొంతకాలం క్రితం నేను యూఎస్‌లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వార్తలు చక్కర్లు కొట్టాయి. నేను గత రెండు రోజులుగా పూణేలో ఉన్నాను. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని వివేక్ వెంకటస్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల అధిష్టానాలపై అసంతృప్తితో ఉన్న నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే వివేక్ వెంకటస్వామి కూడా బీజేపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారని.. అందుకే పార్టీ కార్యక్రమాలలో కూడా ఎక్కువ యాక్టివ్‌గా ఉండటం లేదని ప్రచారం జరుగుతుంది. టీ బీజేపీలో పరిణామాలపై వివేక్ అసంతృప్తిగా ఉన్నారని.. ఈ క్రమంలోనే పార్టీ మారేందుకు సిద్దమయ్యారని ప్రచారం కొంతకాలంగా ప్రచారం సాగుతుంది.
ఇక, వివేక్ విషయానికి వస్తే.. ఆయన తండ్రి జి వెంకటస్వామి చాలా కాలం కాంగ్రెస్‌లో ఉన్నారు. వివేక్ కూడా 2009లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. అయితే వివేక్.. 2013లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు. అయితే 2014 ఎన్నికలకు చాలా ముందే తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన వివేక్.. బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓడిపోయారు. 2016లో మళ్లీ బీఆర్‌ఎస్‌లో చేరి.. 2019లో టిక్కెట్టు దక్కకపోవడంతో ఆ పార్టీని వీడారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు.
