రైతులపై తెలంగాణ సీఎం కేసీఆర్ కపట ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు బీజేపీ మహిళా నేత విజయశాంతి. వారిని ఆదుకునేందుకు ఎలాంటి పథకాన్ని ఆయన అమలు చేయడం లేదని...త్వరలోనే రైతులు కేసీఆర్ కు క‌ర్ర కాల్చి వాత పెడతారని రాములమ్మ జోస్యం చెప్పారు.  

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (kcr) విమర్శలు గుప్పించారు బీజేపీ (bjp) మహిళా నేత విజయశాంతి (vijayashanti) . ఈ మేరకు గురువారం ఆమె తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేశారు. అందులో రాములమ్మ ఏమన్నారంటే.. ‘‘ కేసీఆర్ స‌ర్కార్ రైతన్న‌లపై క‌ప‌ట ప్రేమ‌ను చూపిస్తుంది. తెలంగాణ‌లో గ‌త రెండు రోజులుగా ఎడతెరిపి లేని వాన‌లు అన్న‌దాత‌ల‌ను ఆగం చేస్తున్నాయి. ఎంతో ఆశ‌తో తొలకరికి పంట‌లు వేసుకున్న రైతుల‌ను ఈ వ‌ర్షం తీవ్ర న‌ష్టం క‌లిగింది. రాష్ట్రంలో భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణం అంచనా వేసి ఎకరాకు రూ.20వేల చొప్పున పరిహారం చెల్లించాలి’’. 

‘‘ కొత్తగా పంటలు వేయడానికి విత్తనాలు, ఎరువులు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకం అమలుకు తక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ త‌రుపున‌ డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ స‌ర్కార్ నిర్లక్ష్యం కారణంగా వరదలు, అకాల వర్షాలకు పంట నష్టపోవడం, పరిహారం అందకపోవడం పరిపాటిగా మారింది. రాష్ట్రంలో ప్రకృతి విపత్తులకు పంటలు దెబ్బతిని రైతులు కుదేలవుతున్నా వారిని ఆదుకునే పథకమేదీ ప్రభుత్వం అమలు చేయకపోవడం అన్నదాతల పట్ల కేసీఆర్ కు ఉన్న కపట ప్రేమకు నిదర్శనం. కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమ‌లు చేయ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌కరం. అది అమలు చేయ‌క‌పోయినా దానికి ప్రత్యామ్నాయ పథకాల ద్వారా అయినా వారిని ఆదుకోకపోవడం కేసీఆర్ కు రైత‌న్న‌ల ప‌ట్ల ఉన్న ప్రేమ‌కు నిద‌ర్శ‌నం. కేసీఆర్ చేస్తున్న అరాచక పాల‌న‌ను ప్ర‌జలు చూస్తునే ఉన్నారు. తొంద‌ర్లోనే వారే కేసీఆర్ కు క‌ర్ర కాల్చి వాత పెట్ట‌డం ఖాయం’’.. అని విజయశాంతి జోస్యం చెప్పారు. 

ALso Read:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: రోడ్ మ్యాప్ సిద్ధం చేసిన బీజేపీ.. టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు..

ఇకపోతే.. వ‌ర్షాలు దంచికొడుతున్న వేళ తెలంగాణ‌లో రాజ‌కీయాలు కాక‌రేపుతున్నాయి. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. రాష్ట్రంలోని ప్ర‌ధాన పార్టీలు తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్‌), భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్‌లు ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల దాడుల‌తో రెచ్చిపోతున్నాయి. వ‌చ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి జ‌రిగే ఎన్నిక‌ల్లో జ‌య‌కేత‌నం ఎగుర‌వేయాల‌ని వ్యూహాలు ర‌చిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే బీజేపీ మ‌రింత దూకుడును పెంచింది. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా రాష్ట్ర నాయ‌క‌త్వంతో పాటు కేంద్ర బీజేపీ అగ్ర‌నాయ‌త్వం సైతం అధికార టీఆర్ఎస్‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై విమ‌ర్శ‌ల, తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పిస్తూ పొలిటిక‌ల్ హీట్ ను పెంచుతున్నారు.

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2023లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింద‌ని స‌మాచారం. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. జులై 21 నుంచి 'పల్లె గోస-బీజేపీ భరోసా' పేరుతో బీజేపీ 15 ప్రాంతాల్లో మోటార్ సైకిల్ యాత్ర చేపట్టనుంది. దీనిలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీజేపీ ప్రభుత్వంపై ప్రజలకు అవగాహన పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ "2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ పూర్తిగా సిద్ధమైందని, బూత్ స్థాయిలో బ‌లోపేత‌ కార్యక్రమం కొనసాగుతోంది. రానున్న రోజుల్లో తెలంగాణకు 30 మంది కేంద్ర మంత్రులు కూడా రానున్నారు" అని తెలిపారు. .