Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ రోడ్ మ్యాప్ సిద్ధం చేసిందని ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జి చెప్పారు. జులై 21న ప్రారంభం కానున్న 'పల్లె గోస - బీజేపీ భరోసా' కార్యక్రమ ర్యాలీలో బండి సంజయ్‌తో పాటు మరో 30 మంది సీనియర్ నేతలు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
Telangana Assembly elections: వర్షాలు దంచికొడుతున్న వేళ తెలంగాణలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్‌లు ఆరోపణలు, విమర్శల దాడులతో రెచ్చిపోతున్నాయి. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో జయకేతనం ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ మరింత దూకుడును పెంచింది. సమయం దొరికినప్పుడల్లా రాష్ట్ర నాయకత్వంతో పాటు కేంద్ర బీజేపీ అగ్రనాయత్వం సైతం అధికార టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల, తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ పొలిటికల్ హీట్ ను పెంచుతున్నారు.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2023లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసిందని సమాచారం. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. జులై 21 నుంచి 'పల్లె గోస-బీజేపీ భరోసా' పేరుతో బీజేపీ 15 ప్రాంతాల్లో మోటార్ సైకిల్ యాత్ర చేపట్టనుంది. దీనిలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీజేపీ ప్రభుత్వంపై ప్రజలకు అవగాహన పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ "2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ పూర్తిగా సిద్ధమైందని, బూత్ స్థాయిలో బలోపేత కార్యక్రమం కొనసాగుతోంది. రానున్న రోజుల్లో తెలంగాణకు 30 మంది కేంద్ర మంత్రులు కూడా రానున్నారు" అని తెలిపారు. .
కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తెలంగాణ ప్రజలు సంకల్పించారని, అందుకే లక్షలాది మంది తెలంగాణ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ సంకల్ప యాత్రలో భాగస్వాములయ్యారని తరుణ్ చుగ్ అన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం కూడా తెలంగాణపై సానుకూల ప్రభావం చూపిందని ఆయన అన్నారు. "ఇటీవల హైదరాబాద్‌లో ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం కూడా తెలంగాణపై సానుకూల ప్రభావం చూపింది. ఇది వచ్చే ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)ని కైవసం చేసుకునేందుకు తెలంగాణలోని పార్టీ నాయకులు, క్యాడర్‌లో విశ్వాస స్థాయిలను పెంచింది" అని ఆయన నొక్కి చెప్పారు. జులై 21న ప్రారంభం కానున్న 'పల్లె గోస-బీజేపీ భరోసా' కార్యక్రమ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు మరో 30 మంది సీనియర్ నేతలు పాల్గొనే అవకాశం ఉంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌తో పాటు మరో 30 మంది నేతలు అవగాహన ర్యాలీలో పాల్గొంటారని ఆనయ చెప్పారు.
ప్రజా సంగ్రామ యాత్ర మూడవ దశ ఆగస్టు 2న ప్రారంభమవుతుంది. దీనిలో యాత్రలో దాదాపు 1000-2000 మంది నేతలు పాటు పంచుకోనున్నారని తెలిపారు. సంగ్రామ్ యాత్రలో, మొదటి రోజు మూడు-నాలుగు వందల మంది చేరారు. గ్రామాల్లో సమస్యలు తెలుసుకునేందుకు నాయకులు బైక్ ర్యాలీలు నిర్వహించి ప్రతి నియోజకవర్గానికి ఓ కీలక నేత వెళ్లేలా ప్లాన్ చేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాజకీయ రోజులు దగ్గర పడ్డాయని, టీఆర్‌ఎస్‌లో ఎందరో ఏక్‌నాథ్ షిండేలు ఉన్నారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అంతకుముందు మీడియాలో అన్నారు. మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏం జరుగుతుందో సీఎం కేసీఆర్‌కు ఎలా తెలుసు. బీజేపీకి ఎలాంటి వ్యూహం లేదని చెబుతున్న మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి. బీజేపీకి వ్యూహం లేకపోతే 18 రాష్ట్రాల్లో ఎలా అధికారంలో ఉంటుంది. సీఎం మాట్లాడుతున్న భాష చాలా సిగ్గుచేటన్నారు.
