తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (KCR) బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanti) మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు రాష్ట్రంలో తిరగకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (KCR) బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanti) మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు రాష్ట్రంలో తిరగకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే KCR అంటే.. కోతి, చేష్టల, రావు అని కొత్త అర్థం చెప్పారు. రాష్ట్రంలో K(కోతి), C(చేష్టల), R(రావు) రాజ్యం తీరుగా గత్తరబిత్తర పాలన సాగుతోందని విమర్శించారు. కేసీఆర్‌పై ప్రజల్లో ఆగ్రహం ఉందని.. అందుకనే జిల్లాల పర్యటనలకు వెళ్లకుండా కుంటిసాకుల చూపి వాయిదా వేసుకున్నారని విమర్శించారు. హుజురాబాద్‌ తరహాలోనే తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. 

ఇక, ఇటీవల ఉద్యోగుల బదిలీ ప్రక్రియకు సంబంధించి కూడా విజయశాంతి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగుతుందని అన్నారు. పుండొక చోట ఉంటే... మందొక చోట రాసిన చందంగా రాష్ట్ర సర్కార్ తీరు ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

Also read: నాతో కలిసి నాగలి కట్టి పొలం దున్నుతావా?: కేసీఆర్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 317 వల్ల ఉద్యోగులు, టీచర్ల స్థానికతకే ఇప్పుడు ప్రమాదం ఏర్పడిందని విమర్శించారు. ఈ జీవో కారణంగా స్థానికులైన ఉద్యోగులు జోనల్ విధానంతో వేరే జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడగా.. వీరు తట్టా బుట్టా సర్దుకుని తమ కుటుంబాన్ని, బంధువులను, కష్టపడి నిర్మించుకున్న ఇళ్ళను వదులుకుని కొత్త జిల్లాలో స్థానికులు కావడానికి బయలుదేరాల్సిన పరిస్థితిని రాష్ట్ర సర్కార్ తెచ్చిందని మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన ఏ జిల్లాలోనైనా తక్కువగా పోస్టులుంటే, ఇతర జిల్లాల్లోని మిగులు ఖాళీలను ఆ జిల్లాలకు తరలించడం... లేదా సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించడం చేయాలని అన్నారు. 

అలా సాధ్యం కాకపోతే స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన దిశగా కొత్త రిక్రూట్మెంట్ చేసి పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. కానీ.. ఆరేళ్లలో రిటైర్ అయ్యేవాళ్ళని స్థానికత ఆధారంగా బదిలీ చేసి, జూనియర్ ఉద్యోగులకు అన్యాయం చేయడం ప్రభుత్వ అసమర్థ విధానానికి నిదర్శమని మండిపడ్డారు. ఇప్పటికైనా జీవో 317ను వెంటనే వెనక్కి రాష్ట్ర సర్కార్ తీసుకుని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి తగు పరిష్కారం చూపిస్తే మంచిదని ఆమె సూచించారు.