హైదరాబాద్:  భారతదేశం ప్రధాని నరేంద్రమోదీ చేతుల్లో భద్రంగా ఉందని అభిప్రాయపడ్డారు బీజేపీ నేత, మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు. బీజేపీ మెుదటి నుంచి నిస్వార్థంతో పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. 

బీజేపీ చీఫ్ అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన నాదెండ్ల భాస్కరరావు తొలిసారిగా బీజేపీ రాష్ట్రకార్యాలయానికి చేరుకున్నారు. నాదెండ్లకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ తోపాటు బీజేపీ నేతలు పలువురు స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా బీజేపీలో ఎందుకు చేరాల్సి వచ్చింది అనే అంశాలపై ఆయన ఆసక్తికకర వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకు తెలియని వారంటూ ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. 

ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల ప్రభావం తగ్గిందన్నారు. ఆయా పార్టీలలో బంధు ప్రీతి, కులాభిమానం పెరిగిపోయిందని విమర్శించారు. అందువల్లే తాను జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. 

ప్రధాని నరేంద్ర మోదీ దేశ, విదేశాల్లో మంచి పేరు సంపాదించుకుంటున్నారని స్పష్టం చేశారు. తాను దివంగత ప్రధాని వాజపేయి హయాంలోనే బీజేపీలో చేరాలనుకున్నానని అయితే కుదరలేదని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాల ఆహ్వానంతో బీజేపీలో చేరానని స్పష్టం చేశారు.  

రాజకీయాలలో వయసుతో పనిలేదన్నారు. మనసు ఉత్సాహంగా ఉంటఏ ఏదైనా సాధించవచ్చునని తెలిపారు. ధర్మరాజు 80ఏళ్ల వయసులో యుద్ధం చేశారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు నాదెండ్ల భాస్కరరావు. 

తెలుగు రాష్ట్రాలలో భవిష్యత్ బీజేపీదేనని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి రావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో తనకంటూ ఓ గుర్తింపు ఉందని ఈ నేపథ్యంలో పార్టీ ఆదేశాల మేరకు ఎక్కడ పనిచేయాలని ఆదేశిస్తే ఆ రాష్ట్రంలో పర్యటిస్తానని స్పష్టం చేశారు మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు. 

నాదెండ్ల భాస్కరరావు రాకతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మరింత బలోపేతం అయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. నాదెండ్ల భాస్కరరావును కలుపుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తామని లక్ష్మణ్ స్పష్టం చేశారు.