బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను చూడగానే కళ్లలో నీళ్లు తిరిగాయని.. వెంటనే బాత్రూంకి వెళ్లి ఏడ్చేశానని పేర్కొన్నారు. 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై కొందరు నేతలు ఢిల్లీ పెద్దలకు తప్పుడు ఫిర్యాదులు చేశారంటూ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ వేదిక మీదే వ్యాఖ్యానించారు. కనీసం కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకోనివ్వాలని సంజయ్ కోరారు. ఆ వెంటనే మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

బండి సంజయ్‌ని చూస్తుంటే ఏడుపొచ్చిందని.. అందుకే బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేసినట్లు కోమటిరెడ్డి చెప్పారు. సంజయ్ మంచి స్థాయిలో వుండాలని కోరుకుంటున్నానని.. ఆయన కారణంగానే తెలంగాణలో బీజేపీ బలపడిందన్నారు. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్‌లో బీజేపీ గెలిచింది బండి సంజయ్ నాయకత్వంలోనే అని కోమటిరెడ్డి కొనియాడారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు బీజేపీలో చేరానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో సమిష్టిగా కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. 

ALso Read: తప్పుడు రిపోర్టులొద్దు, కిషన్ రెడ్డిని ప్రశాంతంగా ఉండనివ్వండి: నేతలకు బండి చురకలు

మరోవైపు.. కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన విజయశాంతి మధ్యలోనే వెళ్లిపోవడం కలకలం రేపింది. దీనిపై మీడియాలో రకరకాలుగా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాములమ్మ స్పందించారు. సమావేశం మధ్యలోనే వెళ్లిపోయాననడం సరికాదని.. కిషన్ రెడ్డిని కలిసి అభినందించానని తలిపారు. తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని అణచివేయాలని ప్రయత్నించిన వారు వేదికపై వున్నారంటూ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని విజయశాంతి అన్నారు. తనకు అసౌకర్యంగా వున్నందునే అక్కడి నుంచి వెళ్లిపోయానని ఆమె ట్వీట్ చేశారు. చివరి వరకు ఉండలేకపోయానని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్న సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారు. తెలంగాణ విడిపోతే కరెంట్ కష్టాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇటీవల ఆయన బిజెపిలో చేరారు.