హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజదాని హైదరాబాదులో బిజెపి నేత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. భూవివాదం, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు 

తుర్క యంజాల్ మున్సిపాలిటీలోని తొర్రూర్ గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సంరెడ్డి వెంకట్ రెడ్డి (65) గ్రామంలో తన వ్యవసాయ భూమి పక్కన ఉన్న ఎకరంన్నర భూమికి సంబంధించి పక్క రైతు వద్ద ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాని కోసం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద దాదాపు కోటి రూపాయలు తీసుకుని వచ్ిచ వాటికి మరో రూ.30 లక్షలు జత చేసి రైతుకు ఇచ్చినట్లు సమాచారం.  

అయితే ఆ రైతు భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా వేధించినట్లు తెలుస్తోంది. దాంతో ఇరువురి మధ్య వివాదం చోటు చేసుకుంది. తీవ్ర మనస్తాపానికి గురైన వెంకట్ రెడ్డి మంగళవారం రాత్రి పొలం వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. మంటల్లో అతను పూర్తిగా కాలిపోయాడు. 

హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రికి స్థానికులు అతన్ని తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మరణించాడు.

హైదరాబాదులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలకు బూములు ఇప్పించే పనిని సంరెడ్డి వెంకట్ రెడ్డి నిర్వహిస్తూ వస్తున్నాడు. శ్రీమిత్ర, జన చైతన్య, జీపీఆర్ వంటి భారీ రియల్ ఎస్టేట్ సంస్థలకు అతను భూములు ఇప్పించినట్లు తెలుస్తోంది. ప్రతి ఎన్నికల్లోనూ ఆయన తొర్రూరు గ్రామం నుంచి పోటీ చేస్తూ వస్తుంటాడు. నిరుడు జరిగిన తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 17వ వార్డు నుంచి కౌన్సిలర్ గా పోటీ చేశారు. 

టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన వెంకట్ రెడ్డి ఇటీవల బిజెపిలో చేరారు. కౌన్సిలర్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు.