తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ చేసింది. రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు గాను ఆ పార్టీ సంస్థాగత వ్యవహరాల జాతీయ కార్యదర్శి సంతోష్ మంగళవారం నాడు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. 


హైదరాబాద్: Telangana రాష్ట్రానికి చెందిన BJP నేతలతో ఆ పార్టీ సంస్థాగత వ్యవహరాల జాతీయ కార్యదర్శి BL Santosh మంగళవారం నాడు భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ ఫోకస్ పెట్టింది.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జిల్లా పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జీలతో సంతోష్ భేటీ అయ్యారు. సంతోష్ తో జరిగిన భేటీలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, గరికపాటి మోహన్ రావు, సినీ నటి విజయశాంతి తదితరులు పాల్గొన్నారు.

పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే విషయమై సంతోష్ పార్టీ నేతలతో చర్చించనున్నారు. అంతేకాదు రాష్ట్రంలో పార్టీ సీనియర్ల మధ్య సమన్వయలోపం వంటి అంశాలపై కూడా సంతోష్ చర్చించనున్నారు. పార్టీ నేతల మధ్య సమన్వయలోపాలకు గల కారణాలపై కూడా సంతోష్ ఆరా తీయనున్నారు. వీటన్నింటిని సరిదిద్దేందుకు సంతోష్ కార్యాచరణను సిద్దం చేయనున్నారు. ఇప్పటికే పార్టీ జాతీయ నాయకత్వానికి అందిన సమాచారం మేరకు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సంతోష్ కేంద్రీకరించనున్నారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఈ మేరకు బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. గతంలో కంటే ఎక్కువ ఎంపీ సీట్లను కూడా రాష్ట్రం నుండి దక్కించుకోవాలని ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. మరో వైపు ఇతర పార్టీల్లోని కీలక నేతలను కూడా తమ వైపునకు ఆకర్షించే ప్రయత్నాలు కూడా చేస్తుంది.

TRS నుండి బయటకు వచ్చిన మాజీ మంత్రి Etela Rajender హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించడం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహనికి కారణమైంది.