ఏం చేయాలి, ఏం చేయవద్దు: సోషల్ మీడియాలో బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఆసక్తికర వీడియో
సోషల్ మీడియాలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పోస్టు చేసిన వీడియో ఆసక్తికరమైన చర్చ సాగుతుంది.
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ నేత, మాజీ ఎంపీ ఏ.పీ. జితేందర్ రెడ్డి ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ చర్చకు దారి తీసింది. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం గురువారం నాడు న్యూఢిల్లీలో జరగనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ ఇవాళ ఖరారు చేయనుంది.
తెలంగాణ నుండి పోటీ చేయనున్న పది మంది అభ్యర్థుల జాబితాను ఇవాళ కమల దళం ఖరారు చేసే అవకాశం ఉంది.ఈ తరుణంలో మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్న ఏ.పీ. జితేందర్ రెడ్డి ఎక్స్ వేదికగా ఓ వీడియో పోస్టు చేశారు. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ బిఫోర్ ఎలక్షన్స్ అంటూ ఆ వీడియోకు శీర్షిక పెట్టారు. ఓ చిన్నారి వెనక్కు చేతులు కట్టుకుని తిరుగుతున్న వీడియోను జితేందర్ రెడ్డి పోస్టు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడ సోషల్ మీడియాలో జితేందర్ రెడ్డి ఇదే తరహలో వీడియోలో పోస్టు చేసి చర్చకు కారణమయ్యారు.పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇవాళ తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు న్యూఢిల్లీకి వెళ్లారు. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం తెలంగాణ నేతలను పార్టీ అధినాయకత్వం నుండి పిలుపు అందింది.