తెలంగాణ రాజకీయాలు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రసవత్తరంగా మారాయి. ఇప్పటికే వివిధ పార్టీలు తమ  అభ్యర్ధులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇలా ఇటీవలే మొదటి విడతగా కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది  బిజెపి.  ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి ఉపయోగపడుతుందనుకున్న ఆ ప్రకటనే ఇప్పడు  బిజెపికి తలనొప్పిగా మారింది. 

అసెంబ్లీ బరిలో బిజెపి తరపున పోటీలో నిలిచే అభ్యర్థుల జాబితాలో తమ పేరు లేకపోవడంతో ఆశావహుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో పార్టీని వీడటానికి కూడా కొందరు సీనియర్ నాయకులు సిద్దమయ్యారు. అలా మొదటగా తన అసంతృప్తిని బైటపెట్టుకున్నారు కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి. జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ టిక్కెట్ ను శ్రీనివాస్ రెడ్డి ఆశించారు. అయితే ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో అతడి పేరు లేదు. హుస్నాబాద్ అభ్యర్థిగా తనకు కాకుండా మరొకరికి అవకాశం ఇవ్వడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యానన్నారు. అందువల్లే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు  శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. 

పార్టీలో కష్టపడి పనిచేస్తున్న వారికి గుర్తింపు లేకుండా పోయిందని రాజీనామా లేఖలో పేర్కొన్నాడు. బీజేపీ పెద్దలు తనకు తీవ్ర అన్యాయం చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పలు అంశాలను ప్రస్తావిస్తూ మూడు పేజీలతో కూడిన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు పంపించారు.