Telangana: ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు పేద ప్రజలపై యుద్ధం ప్రకటించిందంటూ తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డారు అసదుద్దీన్ ఒవైసీ. జహంగీర్ పూరి హింస నేపథ్యంలో ముస్లింల ఇండ్లు కూల్చివేతపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన వైఖరిని తప్పనిసరిగా స్పష్టం చేయాలని ఒవైసీ డిమాండ్ చేశారు.
Asaduddin Owaisi: ఆల్ ఇండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మరోసారి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో మాదిరిగానే ఢిల్లీలోనూ ఇళ్లు ధ్వంసం చేసి పేదలపై బీజేపీ యుద్ధం ప్రకటించిందని ఆరోపించారు. ఢిల్లీలో హనుమాన్ జయంతి సందర్భంగా చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో అక్కడి అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు ప్రారంభించారు. దేశ రాజధానిలో అల్లర్లకు గురైన జహంగీర్‌పూరిలో అక్రమ ఆక్రమణల కూల్చివేతపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. పై వ్యాఖ్యలు చేశారు.
'బీజేపీ పేదలపై యుద్ధం ప్రకటించింది. ఆక్రమణల పేరుతో UP & MP తరహా ఘటనలతో దేశరాజధాని ఢిల్లీలో ఇళ్లను ధ్వంసం చేయబోతోంది. నోటీస్ ఇవ్వలేదు, కోర్టుకు వెళ్లే అవకాశం లేదు, బతకడానికి సాహసించిన పేద ముస్లింలను శిక్షిస్తోందని” ఒవైసీ ట్వీట్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన వైఖరిని స్పష్టం చేయాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఈ కూల్చివేత డ్రైవ్‌లో తన ప్రభుత్వ PWD భాగమేనా అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు మా నియంత్రణలో లేరు అని ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ తప్పించుకోలేరని మండిపడ్డారు. ఢిల్లీ సర్కారులోని పలు శాఖలు కూడా కూల్చివేతల్లో భాగం అయ్యయాని గుర్తు చేశారు. ఇలాంటి పిరికిపంద చర్యలు, ఇలాంటి మోసకారి తనానికేనా జహంగీర్ పూరి ప్రజలు ఓటేసిందంటూ మండిపడ్డారు.
మరో ట్వీట్ లోనూ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు. 20 కోట్ల చిన్న సమూహం కూడా ప్రతికార రాడికల్ చర్యలకు దిగితే ఆ పరిస్థితులను ప్రభుత్వం నిర్వహించగలదా? అంటూ ప్రశ్నించారు.
కాగా, ఢిల్లీలో హనుమాన్ జయంతి సందర్భంగా చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో అక్కడి అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు ప్రారంభించారు. పోలీసులను భారీగా మోహరించి.. ప్రాంతాల్లోని కట్టడాలను కూల్చివేస్తున్నారు. అయితే, అంతకు ముందు నిర్మాణాల కూల్చివేతపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అత్యున్నత న్యాయస్థానం కూల్చివేతలను ఆపాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే, తమకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇంకా అందలేదని.. అందుకే కూల్చివేత చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
