చెన్నమనేనికి మొండిచేయి: పైచేయి సాధించిన ఈటల
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తుంది. ఈ ఎన్నికల్లో జనసేనతో ఆ పార్టీ పొత్తు పెట్టుకుంది. జనసేనకు ఎనిమిది నుండి తొమ్మిది స్థానాలను కేటాయించే అవకాశం ఉంది.
హైదరాబాద్: మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావుకు బీజేపీ మొండి చేయి చూపింది. ఈటల రాజేందర్ తో పాటు బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిన తుల ఉమకు వేములవాడ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ టిక్కెట్టు కేటాయించింది.
ఈ ఏడాది ఆగస్టు 30వ తేదీన డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు బీజేపీలో చేరారు. వికాస్ రావు మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు. వికాస్ రావు తో పాటు ఆయన భార్య కూడ బీజేపీలో చేరారు. వేములవాడ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగాలని వికాస్ రావు భావించారు.ఈ మేరకు ఆయన సన్నాహలు చేసుకున్నారు. అయితే వేములవాడ అసెంబ్లీ స్థానం నుండి మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ టిక్కెట్టు ఆశించారు.
తుల ఉమకు ఈటల రాజేందర్ మద్దతు ఉంది. ఈ స్థానంలో తులమ ఉమకే బీజేపీ టిక్కెట్టు కేటాయించింది. వేములవాడలో పోటీ కోసం వికాస్ రావు కూడ టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేశారు. తనపై నమ్మకం ఉంచి పార్టీ టిక్కెట్టు కేటాయిస్తే వేములవాడ నుండి బరిలోకి దిగుతానని వికాస్ రావు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో వికాస్ రావు అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈటల రాజేందర్ వెంట తుల ఉమ, ఏనుగు రవీందర్ రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ తీరుపై ఏనుగు రవీందర్ రెడ్డి అసంతృప్తితో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. తుల ఉమ బీజేపీలో కొనసాగుతున్నారు. వేములవాడ అసెంబ్లీ టిక్కెట్టు దక్కకపోతే పార్టీని వీడుతానని తుల ఉమ రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందనే ప్రచారం కూడ సాగింది. అయితే తుల ఉమకు వేములవాడ అసెంబ్లీ టిక్కెట్టు కేటాయించాలని ఈటల రాజేందర్ పట్టుబట్టినట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఇవాళ బీజేపీ విడుదల చేసిన నాలుగో జాబితాలో తుల ఉమకు చోటు దక్కింది.
also read:బీజేపీ నాలుగో జాబితా విడుదల.. 12 మంది ఎవరెవరంటే..
ఇటీవలనే పార్టీలో చేరిన ఇద్దరికి బీజేపీ టిక్కెట్లు కేటాయించింది.ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి బీజేపీ టిక్కెట్టు కేటాయించింది. మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి చలమల కృష్ణారెడ్డి కూడ ఇటీవలనే బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు దక్కని కారణంగా వడ్డేపల్లి సుభాష్ రెడ్డి బీజేపీలో చేరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరడంతో కాంగ్రెస్ టిక్కెట్టు దక్కని కారణంగా చలమల కృష్ణారెడ్డి బీజేపీలో చేరారు. ఈ ఇద్దరికి బీజేపీ టిక్కెట్లు కేటాయించింది.