ఇద్దరు తెలంగాణ పోలీసు అధికారులకు భారతీయ జనతా పార్టీ షాక్ తగిలింది. బిజెపి దెబ్బతో ఇద్దరు పోలీసు అధికారులు ఉద్యోగాల్లోంచి సస్పెండ్ అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ సంఘటన సంచలనం రేపింది పూర్తి వివరాలిలా ఉన్నాయి.

నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి పట్టణ సిఐ శ్రీనివాసరావు, ఎస్సై రాఘవేందర్ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు పడింది. గురువారం నాడు వారిని సస్పెండ్ చేశారు. వీరి సస్పెన్సన్ కు ప్రధాన కారణం రెండు నెలల క్రితం కల్వకుర్తి పట్టణంలో ఒక మతానికి చెందిన వారు ప్రచారం నిర్వహిస్తున్నారు. దాన్ని మరో మతానికి చెందిన వారు అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో కల్వకుర్తి పోలీసులు అడ్డుకున్న మతస్థులను కంట్రోల్ చేసేందుకు వారిపై పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలున్నాయి. ఆందోళనకారులను అరెస్టు కూడా  చేశారు.

ఈ దాడిపై స్థానిక బిజెపి సీనియర్ నేత, గత ఎన్నికల్లో కల్వకుర్తి బిజెపి అభ్యర్థి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు చేసిన ధౌర్జన్యాన్ని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అయితే తమకు అన్యాయం జరిగిందంటూ ఆయన ఏకంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు నేరుగా ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఫిర్యాదు అందడంతో ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్ర హోంశఆఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపింది. విచారణ అనంతరం కల్వకుర్తి సిఐ, ఎస్సైల మీద సస్పెన్షన్ వేటు వేసింది. తమపై పోలీసులు అకారణంగా దాడి చేశారని బిజెపి నేతలు చెబుతున్నారు. సంయమనంతో వ్యవహరించాల్సిన పోలీసులు బిజెపి వారిపై దాడి చేశారని వారు ఆరోపిస్తున్నారు. అందుకే ఆ ఇద్దరు పోలీసుల మీద వేటు పడిందని చెబుతున్నారు.