Asianet News TeluguAsianet News Telugu

ఆపరేషన్ ఆకర్ష్: తెలంగాణలో బీజేపీ వ్యూహం ఇదీ....

తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టేందుకు బీజేపీ నాయకత్వం  ప్లాన్ చేస్తోంది.తెలంగాణలో 4 ఎంపీ స్థానాలను  కైవసం చేసుకోవడం కూడ బీజేపీ నాయకత్వానికి మంచి ఊపునిచ్చింది.
 

bjp game plan for telangana after parliament elections
Author
Hyderabad, First Published Jun 4, 2019, 3:59 PM IST

హైదరాబాద్:  తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టేందుకు బీజేపీ నాయకత్వం  ప్లాన్ చేస్తోంది.తెలంగాణలో 4 ఎంపీ స్థానాలను  కైవసం చేసుకోవడం కూడ బీజేపీ నాయకత్వానికి మంచి ఊపునిచ్చింది.

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీ నేతలు ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకోవాలని ప్లాన్ చేశారు. కానీ, అది సాధ్యం కాలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి ఒక్క ఎమ్మెల్యే స్థానంతోనే సరిపెట్టుకొంది.

2014 ఎన్నికల్లో  టీడీపీ మద్దతుతో ఐదు అసెంబ్లీ, ఒక్క ఎంపీ స్థానాన్ని బీజేపీ గెలుచుకొంది. 2018 నాటికి బీజేపీ బలం కేవలం ఒక్క ఎమ్మెల్యే స్థానానికి పరిమితమైంది. 2019 ఏప్రిల్ 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో  నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకొంది.

పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో మంచి ఉత్సాహన్ని ఇచ్చాయి.  ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో రానున్న రోజుల్లో మార్పులు సంభవించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

తెలంగాణ రాష్ట్రం బీజేపీ పరిపాలన సాగించేందుకు అనువుగా ఉన్న రాష్ట్రం అని బీజేపీ అగ్రనేత మురళీధర్ రావు వ్యాఖ్యానించారు. సోమవారం నాడు నిజామాబాద్ వేదికగా బీజేపీకి చెందిన మరో అగ్రనేత రామ్ మాధవ్ కూడ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలకు చెక్ పెడతామని ఆయన కామెంట్స్ చేశారు.

సికింద్రాబాద్ ఎంపీ స్థానంనుండి విజయం సాధించిన జి. కిషన్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. కేంద్రంలో కూడ బీజేపీ అధికారంలో ఉంది. దీంతో ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలను తమ పార్టీల్లో చేర్చుకొనేందుకు బీజేపీ వ్యూహం రచిస్తోంది.

మరో వైపు తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలపై కూడ బీజేపీ కేంద్రీకరించనుంది. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం రాజకీయాలను ప్రభావితం చేయనున్నారు. తెలంగాణ గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గంతో పాటు బీసీలు, మైనార్టీలు, దళితులు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేయనున్నారు.

తెలంగాణలో ఇప్పటికే టీడీపీ కోలుకోలేని విధంగా దెబ్బతింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో టీడీపీ నేతలు చేరారు. టీడీపీలో ఉన్న కొందరు నేతలు ప్రస్తుతం బీజేపీ వైపు చూస్తున్నారని సమాచారం. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జి. కిషన్ రెడ్డిని టీటీడీపీ నేతలు ఇ.పెద్దిరెడ్డి, చాడ సురేష్‌ రెడ్డిలు కలిశారు. వీరిద్దరూ కూడ బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని పెద్దిరెడ్డి ఖండించారు.

తెలంగాణలో టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది. టీఆర్ఎస్‌కు తామే ప్రత్నామ్నాయం అనే ప్రజలను నమ్మించేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పుంజుకొనే పరిస్థితి లేదని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వచ్చే అసెంబ్లీ నాటికి బీజేపీని అధికారంలోకి తెచ్చే విధంగా  ఆ పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ఫోకస్ పెట్టింది.

Follow Us:
Download App:
  • android
  • ios