అసెంబ్లీ నుంచి పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తర్వాత బండి సంజయ్ నాయకత్వంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. 

తెలంగాణ అసెంబ్లీ నుంచి తమ పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ బీజేపీ రాష్ట్ర హైకోర్టును (telangana high court) ఆశ్రయించింది. దీనికి సంబంధించి మంగళవారం ఉదయం న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేసింది. అలాగే సస్పెషన్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (bandi sanjay) నేతృత్వంలో భారత రాష్ట్రపతిని కలవాలని ఆ పార్టీ నిర్ణయించింది. హైకోర్టులో పిటిషన్‌పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందరావు మాట్లాడుతూ.... హైకోర్టులో తీర్పు తమకు అనుకూలంగా ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు అనుకూలంగా సుప్రీంకోర్టు (supreme court) ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా రఘునందన్ రావు గుర్తుచేశారు. 

శాసనసభలో స్పీకర్ తీరు కీలుబొమ్మ మాదిరి ఉందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ సెక్షన్ కింద బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారో ప్రజలకు స్పీకర్ చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్‌ చేశారు. సభలో గవర్నర్‌ను అవమానిస్తూ.. బల్లలు ఎక్కిన హరీష్ రావుతో నీతులు చెప్పించుకునే స్థితిలో బీజేపీ లేదంటూ చురకలు వేశారు. బడ్జెట్ స్పీచ్‌లో రాజకీయ విమర్శలు చేసిన మంత్రిగా హరీష్ రావు చరిత్రలో నిలిచిపోతారంటూ రఘునందన్ రావు దుయ్యబట్టారు.

కేంద్రాన్ని తిట్టడానికి మాత్రమే బడ్జెట్ స్పీచ్‌ను ఉపయోగించుకోవటం దుర్మార్గమన్నారు. తమ స్థానంలో నిలబడి నిరసన చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేయలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్వయంగా రాసి ఇచ్చిన పేపర్‌ను తలసాని సభలో చదివారని ఆయన మండిపడ్డారు. పాలకపక్షంతో పాటు.‌‌. ప్రతిపక్షం కూడా బాగుంటేనే స్పీకర్‌కు గౌరవం పెరుగుతుందని రఘునందన్ రావు హితవు పలికారు. ఏ సెక్షన్ కింద సస్పెషన్ చేశారో రాతపూర్వకంగా చెప్పాలని అసెంబ్లీ సెక్రటరీని అడిగితే నాలుగు రోజులు సమయం అడిగారని రఘనందనరావు తెలిపారు. 

కాగా, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు ముగిసేవరకు వారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే శాసనసభలో మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే హరీష్ రావు (harish rao) బడ్జెట్ ప్రసంగం కొనసాగిస్తుండగా బీజేపీ సభ్యులు (bjp) వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే హరీష్ రావు తన ప్రసంగానికి స్వల్ప విరామం ఇచ్చారు. 

బీజేపీ సభ్యులు రఘునందన్ రావు (raghunandan rao) , రాజాసింగ్ (raja singh), ఈటల రాజేందర్‌లను (etela rajender) ఈ సెషన్ ముగిసేవరకు శాసనసభ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ శాసనసభ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రావు తీర్మానాన్ని ప్రతిపాదించగా.. ఇందుకు స్పీకర్ పోచారం ఆమోదం తెలిపారు. మొత్తం ముగ్గురు బీజేపీ సభ్యులను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. బీజేపీ సభ్యుల సస్పెన్షన్ అనంతరం హరీష్ రావు సభలో తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. శాసనసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్‌లు అసెంబ్లీ గేటు బయట కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, టీఆర్ఎస్ నుంచి బైటికి వచ్చి.. బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత మొదటిసారి అసెంబ్లీకి వెడుతున్న ఈటెల రాజేందర్ ముందుగా.. టాంక్ బండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తరువాత గన్ పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు కూడా పాల్గొన్నారు.