హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావుపై బిజెపి రాష్ట్ర నాయకత్వం చార్జిషీట్ విడుదల చేసింది. కేసిఆర్ పై 130 ఆరోపణలతో ఆ చార్జిషీట్ ను శనివారం విడుదల చేసింది.

ప్రజా కోర్టులో తేల్చుకునేందుకే పాలక టీఆర్ఎస్ పై ఆ చార్జిషీట్ ను ప్రజల ముందు పెడుతున్నామని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కె. లక్ష్మణ్ చెప్పారు. తన 11 పేజీల చార్జిషీట్ లో బిజెపి 130కి పైగా ఆరోపణలు చేసింది. 

దళిత సమస్యలను, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం దగ్గర నుంచి ప్రభుత్వం డబుల్ బెడ్రూం నిర్మించడంలో చెందిన వైఫల్యాన్ని అందులో ఎత్తి చూపారు. నీటి పారుదుల, విద్యుచ్ఛక్తి, ఆరోగ్య, స్థానిక సంస్థల రంగాల్లో ఎలా ప్రభుత్వం విఫలమైందనేది వివరించారు. 

జిల్లాల పునర్వ్యస్థీకరణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయకపోవడాన్ని తప్పు పట్టింది. ఆబ్కారీ, పర్యాటక, ఐటి, పారిశ్రామిక రంగాల్లో ప్రభుత్వం విఫలమైన తీరును ఎండగట్టారు. సామాజిక, ఆర్థిక రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని విమర్శించారు. రైతు సమస్యలను కూడా చార్జిషీట్ లో ప్రస్తావించారు. 

ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్లకపోగా, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని లక్ష్మణ్ విమర్శించారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మందికిపైగా మరణించినప్పుడు సంఘటనా స్థలాన్ని కేసిఆర్ సందర్శించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. 

ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పట్టణ మౌలిక సదుపాయాలు కల్పించడంలో కేసిఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.