వరంగల్: పార్లమెంటు ఎన్నికల్లో 4సీట్లు గెలిచిన జోష్ లో ఉన్న బీజేపీ తనపట్టును తెలంగాణపై మరింత పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రతి నెలా ఒక కేంద్రమంత్రి తెలంగాణాలో పర్యటించడం దగ్గరనుంచి మొదలుకొని కిషన్ రెడ్డి కి మంత్రి పదవిని కట్టబెట్టడం వరకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.  

ఏ వర్గాన్నీ వదలకుండా, అన్ని వర్గాల ప్రజలకు చేరువవ్వాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే తెలంగాణలోని గిరిజనులకు గాలం వేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ద్వారా ఈ ఆదిలాబాద్ ప్రాంతంలో బలపడాలని బీజేపీ గట్టి ప్రయత్నమే చేస్తుంది. 

లంబాడాలకు ఆదివాసీలకు మధ్య రేజర్వేషన్ల గురించి పెద్ద ఎత్తున విభేదాలు నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయాన్నీ ఉపయోగించుకొని బీజేపీ చాల బలంగానే రాజకీయం చేస్తుంది. 

తాజాగా మరో వర్గంపై కన్నేసింది బీజేపీ. వారే సింగరేణి బొగ్గు గని కార్మికులు. వీరు తెలంగాణలోని 6 జిల్లాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో విస్తరించి ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, జైశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ఖమ్మం, పెద్దపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ సింగరేణి కార్మికులు వారి కుటుంబీకులు, విశ్రాంత సింగరేణి ఉద్యోగులు స్థిర నివాసాలు ఏర్పరుచుకున్నారు. 

ఈ 6 జిల్లాల్లకు చెందిన దాదాపు 12 నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో వీరు విస్తరించి ఉన్నారు. బొగ్గు గనుల్లో ప్రస్తుతం 50వేల మంది కార్మికులు పనిచేస్తుండగా, దాదాపు 1.5లక్షలమంది విశ్రాంత ఉద్యోగులున్నారు. వీరితోపాటు వారి కుటుంబాల ఓట్లు కూడా ఉండనే ఉన్నాయి. 

కెసిఆర్ బొగ్గు గని కార్మికులకు ఎంతో చేస్తానని మాట ఇచ్చి తప్పాడని, ఇప్పటి వరకు బొగ్గు గని కార్మికులకు కెసిఆర్ ఎం చేయలేదని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయనున్నారు. ఈ డోర్ టు డోర్ కాన్వాసింగ్ లో బీజేపీ సీనియర్ నేతలు సైతం పాల్గొంటారని సమాచారం. 

ఇప్పటికే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో బీజేపీ విజయవంతంగా ఆపరేషన్ కమలాన్ని నడిపి సక్సెస్ అయ్యింది. ఈ సంఘం అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య రాజీనామా చేసాడు. అమిత్ షా గనుక సెప్టెంబర్ 17న తెలంగాణాలో పర్యటించివుంటే, అదే రోజు కెంగెర్ల మల్లయ్య బీజేపీ అనుబంధ సంస్థ బీఎంఎస్ లో చేరిపోయి ఉండేవాడు. 

కాకపోతే అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దవడంతో, కెంగెర్ల మల్లయ్య బీజేపీ అనుబంధ సంస్థలో చేరడం ఆలస్యమవుతోంది. ఇతను తనవెంట తన వర్గాన్ని తీసుకొని బీఎంఎస్ లో చేరనున్నట్టు సమాచారం. ఈ మల్లయ్య గని కార్మికులందరినీ ఏకంచేసి ఎన్నికలప్పుడు తెరాస కు వారి మద్దతు కూడగట్టాడు. 

కార్మికుల్లో ఎక్కువమంది మల్లయ్య తోపాటుగా బీఎంఎస్ లో చేరకుండా ఉండేందుకే కెసిఆర్ అంత భారీ బోనస్ ప్రకటించడాని సింగరేణి కార్మికులు అంటున్నారు. ఏదిఏమైనా బీజేపీ మాత్రం తన పావులను చాలా తెలివిగా కదుపుతోందని అర్థమవుతుంది.

సంబంధిత వార్తలు

సింగరేణి కార్మికులకు కేసీఆర్ దసరా బొనాంజా

బిఎంఎస్‌లోకి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేత మల్లయ్య?