జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం.. లైఫ్ జాకెట్‌లతో బీజేపీ కార్పొరేటర్ల వినూత్న నిరసన..
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ఈరోజు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ పరిధిలో నెలకొన్న సమస్యలపై వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ఈరోజు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ పరిధిలో నెలకొన్న సమస్యలపై వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. నగరంలో కుక్క కాట్లు, వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, నాలాలో పడి చిన్నారి మృతిచెండం.. వంటి సమస్యలను ప్రతిబింబించేలా నిరసనకు దిగారు.
వర్షాలు పడితే నగరం నీట మునుగుతుందంటూ తెలిపేలా కొందరు బీజేపీ కార్పొరేటర్లు లైఫ్ జాకెట్లు ధరించి జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చినవారిలో ఒకరు దోమ గెటప్ ధరించారు. అగ్ని ప్రమాదాలు, నాలాల పూడికితీత, దోమల స్వైర విహారం వంటి సమస్యలను నేటి సర్వసభ్య సమావేశంలో ప్రస్తావిస్తామని బీజేపీ కార్పొరేటర్లు చెబుతున్నారు. ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ మేయర్ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
జీహెచ్‌ఎంసీ గత సమావేశం కూడా ఎటువంటి చర్చ లేకుండానే గందరగోళం మధ్య అర్ధాంతరంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాలుగు నెలల తర్వాత జరుగుతున్న జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఆసక్తి నెలకొంది. ఇక, నేటి సమావేశం అజెండాలో 17 అంశాలు ఉన్నాయి. అయితే బీజేపీ కార్పొరేటర్ల నిరసనల నేపథ్యంలో ఈ రోజు సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.