Asianet News TeluguAsianet News Telugu

ఆలయం ఇష్యూ : ఎమ్మెల్యే రాజాసింగ్ కు బిజెపి కార్పోరేటర్ షాక్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫిలింనగర్ లో ఆంజనేయస్వామి ఆలయ స్థలాన్ని పరిశీలించారు. పల్లపు గోవర్దన్‌ నేతృత్వంలో వివాదం గురించి వివరించారు. రాజాసింగ్ తిరిగి వెళ్తున్న సమయంలో స్థానిక బీజేపీ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ అనుచరులు ఆయనను అడ్డుకున్నారు

bjp corporator protest against mla rajasingh over temple issue in banjarahills, hyderabad
Author
Hyderabad, First Published Aug 12, 2021, 9:20 AM IST

బంజారా హిల్స్ : ఫిలింనగర్ లో ఆంజనేయస్వామి ఆలయ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. షేక్ పేటకు వెళ్లే దారిలో ఉన్న 10 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఆ స్థలంలో ఆంజనేయ స్వామి ఆలయం ఉందని దాన్ని అక్కడే నిర్మించాలని భజరంగ్‌దళ్‌ గతంలో డిమాండ్ చేసింది. 

ఆలయ చైర్మన్ రమణ తదితరులతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఆలయాన్ని పక్కనే ఉన్న మరో ప్రత్యామ్నాయ స్థలంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ఈ మేరకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆలయ నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు.  ఇందుకోసం ప్రభుత్వం నుంచి మరో 600 గజాల స్థలాన్ని సేకరించినట్టు చెప్పారు. 

భవ్య మందిరం తో పాటు గోశాల, చిన్నపాటి కళ్యాణమండపం నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఎమ్మెల్యే వెళ్లిపోయాక ఆలయం ఉన్న చోటే నిర్మించాలని భజరంగ్‌దళ్‌,  బిజెపి నాయకులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. కొంతమంది బిజెపి నాయకులు ప్రత్యామ్నాయ స్థలంలో నిర్మించడానికి సుముఖం వ్యక్తం చేశారు. 

ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ స్థలాన్ని పరిశీలించారు. పల్లపు గోవర్దన్‌ నేతృత్వంలో వివాదం గురించి వివరించారు. రాజాసింగ్ తిరిగి వెళ్తున్న సమయంలో స్థానిక బీజేపీ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ అనుచరులు ఆయనను అడ్డుకున్నారు.ప్రోటోకాల్ పాటించకుండా ఎలా వస్తారంటూ  రాజాసింగ్ ను నిలదీశారు.  దీంతో రెండు గంటలపాటు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఇదిలా ఉండగా, ఈ నెల మొదట్లో గోషా మహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గోషా మహల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన కీలక ప్రకటన చేశారు. 

తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని నియోజకవర్గ ప్రజలు ఒత్తిడి చేస్తున్నారని, సీఎం నిధులు ప్రకటించిన వెంటనే స్పీకర్ ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని గోషా మహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.  

ఉప ఎన్నిక వస్తే కెసిఆర్ కు బడుగులు, రైతులపై ప్రేమ వస్తుందన్నారు. అంతేకాకుండా గోషామహల్ నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ బీసీలకు సైతం పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇస్తే కచ్చితంగా స్పీకర్ దగ్గరకు వెళ్లి రాజీనామా పత్రాన్ని అందజేస్తానని రాజా సింగ్ స్పష్టం చేశారు.

అసలు ఏం జరిగిందంటే.. హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రావడం రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో తెరపైకి వచ్చిన హుజురాబాద్ ఉప ఎన్నికను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, ఆ నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుండడంతో.. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. 

ప్రత్యేకించి అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులకే ఈ పరిస్థితి ఎక్కువగా ఎదురవుతుంది. అయితే ఇది కాస్త బిజెపి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పాకింది. దీంతో రాజాసింగ్ ఇలా స్పందించారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios