తెలంగాణ సచివాలయం మసీదు రూపంలో ఉన్నదన్న బీజేపీ.. నెటిజన్లు ఏమన్నారంటే?
తెలంగాణ నూతన సచివాలయం పైన ఉన్న గుమ్మటాలను చూపుతూ ఇది మసీదు నిర్మాణాన్ని పోలి ఉన్నదని కొన్ని ఆరోపణలు వచ్చాయి. కానీ, ఆ ఆరోపణలను సాధారణ పౌరులు చాలా వరకు తిప్పికొట్టారు. ఇది ఇంటర్నెట్‌లో స్పష్టంగా కనిపించింది.
హైదరాబాద్: తెలంగాణ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ఈ రోజు ఘనంగా ప్రారంభించారు. అయితే, ప్రారంభానికి ముందే ఈ సచివాలయ నిర్మాణంపై చర్చ మొదలైంది. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ.. తెలంగాణ సచివాలయం మసీదు నిర్మాణాన్ని పోలి ఉన్నదని ఆరోపించింది(సచివాలయపై పైనున్న గుమ్మటాలపై అభ్యంతరం!). తెలంగాణ సాంస్కృతిక వారసత్వ శైలి కనిపించలేదని, మెజార్టీగా ఉన్న హిందువు మనోభావాలు ప్రతిబింబించలేదని పేర్కొంది. బీజేపీ ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఈ విషయాలను ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై నెటిజన్ల స్పందన చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలోని ఆలయాలు, రాజ భవనాల నుంచే సచివాలయ గుమ్మటాలకు ప్రేరణ తీసుకున్నామని, తెలంగాణ, శివుడి ముఖ్యంగా నీలకంటేశ్వర ఆలయం, వనపర్తి ప్యాలెస్‌ల రిఫరెన్స్‌లను తీసుకున్నట్టు ఆర్కటిక్చర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ ప్రెస్ హ్యాండిల్ బీజేపీ ట్వీట్ పై రియాక్ట్ అయింది. హైదరాబాద్‌లో హైదరాబాదీ బిర్యానీ నిషేధిస్తారా? హైదరాబాద్ అంటే సమ్మిళిత సంస్కృతి, ప్రతి మతానికి ఆశ్రయం అని పేర్కొంది.
చాలా మంది వారికి తెలిసిన ప్రముఖ నిర్మాణాలను ప్రస్తావించారు. సుప్రీంకోర్టు మొదలు మైసూర్ ప్యాలెస్ వరకు నిర్మాణాలపైనా డోమ్‌లను గుర్తు చేశారు. కొందరు బీజేపీ పాలిత రాష్ట్రాలు కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ సచివాలయ చిత్రాలనూ పోస్టు చేసి అలాంటి డోమ్‌లు ఉన్నట్టు పేర్కొన్నారు.
ఇంకొకరు తాను బీజేపీ, బీఆర్ఎస్‌లకు మద్దతుదారుడిని కాదంటూనే హిందూ, ముస్లింల మధ్య సంబంధాలను చెడగొట్ట వద్దని విజ్ఞప్తి చేశారు. హిందువుల మనోభావాలను ప్రతిబింబించడం లేదంటే.. నూతన పార్లమెంటు భవనం హిందు ఆలయాలను ప్రతిబింబిస్తున్నదా? అని ఇంకొకరు ప్రశ్నించారు.