హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు అమిత్ షా. దేశంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని విమర్శించారు. హైదరాబాద్ లో పర్యటించిన అమిత్ షా శంషాబాద్ లోని కేఎల్ సీసీ సెంటర్ లో కార్యకర్తలతో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  

బీజేపీకి సిద్ధాంతాలు అంటూ ఉన్నాయని కాంగ్రెస్ పార్టీకి అవేమీ ఉండవన్నారు. బీజేపీ సిద్ధాంతాల ఆధారంగా పనిచేస్తే కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలమీద ఆధారపడి పనిచేస్తోందని విమర్శించారు.  

కాంగ్రెస్ పార్టీ అంటేనే కుటుంబ పాలన అంటూ అమిత్ షా విమర్శించారు. బీజేపీలో వారసత్వ రాజకీయాలు ఉండవన్నారు. కుటుంబ పాలన అస్సలే ఉండదని చెప్పుకొచ్చారు. బీజేపీ విజయంతో అహంకారం పెంచుకోలేదన్నారు. అలాగని ఓటమికి కుంగిపోలేదని స్పష్టం చేశారు. 

కానీ కాంగ్రెస్‌  పార్టీ ఓటమిని తట్టుకోలేకపోతుందని విమర్శించారు. తమను చూసి కాంగ్రెస్ పార్టీ నవ్విందని ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిందన్నారు. భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదన్నారు. 

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏ కాంగ్రెస్, ఐ కాంగ్రెస్ అంటూ ఏబీసీడీలుగా విడిపోయిందని భవిష్యత్ లో ఖండఖండాలుగా చీలిపోతుందని జోస్యం చెప్పారు. బీజేపీలో ప్రతి సభ్యుడికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. కింది స్థాయి నాయకుడు ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం బీజేపీ కల్పిస్తోందని అమిత్ షా స్పష్టం చేశారు. 

కేంద్ర బడ్జెట్‌లో రైతులకు, పేదలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని,  సమాజంలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. అందరి సంక్షేమమే బీజేపీ లక్ష్యమని, సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదంతో ముందుకెళుతున్నామని అమిత్ షా స్పష్టం చేశారు.   

ఈ వార్తలు కూడా చదవండి

వలసలపై అమిత్ షా క్లారిటీ: రాజకీయ పార్టీల్లో గుబులు

తెలంగాణలో అతిపెద్దపార్టీగా అవతరిస్తాం, జెండా ఎగురవేస్తాం: అమిత్ షా

హైదరాబాద్ కు అమిత్ షా, తండాలో భోజనం చేసిన కేంద్రహోంమంత్రి

జనసేన నేతకు షాక్: బీజేపీలో చేరిన మాజీ సీఎం నాదెండ్ల, కండువాకప్పిన అమిత్ షా