హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బీజేపీ అఖండ విజయం సాధించిందని కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రకటించారు. తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని స్పష్టం చేశారు. 

శంషాబాద్ లోని కేఎల్ సీసీ సెంటర్ లో కార్యకర్తలతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా కేంద్రంలో బీజేపీ ప్రచండ విజయం సాధించిందని అంతే ఉత్సాహంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అఖండ విజయం సాధించిన తర్వాత తాను తెలంగాణ రాష్ట్రానికి తొలిసారిగా వచ్చానని తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రంలో 29 శాతం ఓట్లు ఇచ్చి బీజేపీని ఆదరించిన ప్రతీ తెలంగాణ పౌరుడికి ధన్యవాదాలు తెలిపారు అమిత్ షా. తెలంగాణలో ఖచ్చితంగా కాషాయి జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

భవిష్యత్ లో తెలంగాణలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడం ఖాయమన్నారు. తెలంగాణలో నిజాం, రజాకార్లు విధ్వంసం సృష్టించారని గుర్తు చేశారు. రజాకార్ల వ్యతిరేక ఉద్యమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.