ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ ఆత్మహత్యపై రేపు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. అలాగే గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను కలిసి బీజేపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది.
ఖమ్మంలో (khammam) బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ ఆత్మహత్య కేసు రాజకీయ దుమారం రేపుతోంది. అన్ని పార్టీలు ఘాటుగా స్పందించాయి. సాయి ఆత్మహత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రియాక్ట్ కావడం.. అలాగే కాంగ్రెస్ కీలక నేతలు కూడా స్పందించడంతో ఖమ్మంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. డైలాగ్ వార్ పీక్స్‌కు చేరుతోంది. సాయిగణేష్ ఆత్మహత్యకు నిరసనగా రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. సాయి గణేశ్ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు. రేపు పాదయాత్ర శిబిరం దగ్గరే బండి సంజయ్ నిరసనకు కూర్చోనున్నారు. అలాగే రేపు గవర్నర్ తమిళిసైని కలిసి ఈ ఘటనపై ఫిర్యాదు చేయనున్నారు బీజేపీ నేతలు. దీనికి సంబంధించి ఖమ్మం జిల్లా బీజేపీ ప్రతినిధి బృందానికి ఆమె అపాయింట్‌మెంట్ ఇచ్చారు.
మరోవైపు.. ఆత్మహత్య చేసుకొన్న BJP కార్యకర్త Sai Ganesh కుటుంబ సభ్యులకు కేంద్ర హోంశాఖ మంత్రి Amit Shah మంగళవారం నాడు ఫోన్ చేశారు. సాయి గణేష్ కుటుంబ సభ్యులను ఈ ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఇవాళ సాయి గణేష్ కుటుంబ సభ్యులను బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి పరామర్శించారు. ఆత్మహత్య విషయమై అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సాయి గణేష్ కుటుంబ సభ్యులతో అమిత్ షా స్వయంగా మాట్లాడి ఓదార్చారు.
ఈ నెల 14వ తేదీన ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ముందు సాయి గణేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 16న తుదిశ్వాస విడిచాడు. ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో సాయి గణేష్ మీడియాతో మాట్లాడారు. తనపై మంత్రి Puvvada Ajay Kumar అక్రమంగా 16 కేసులు నమోదు చేయించారని ఆరోపించాడు. ఈ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా సాయి గణేష్ చెప్పారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సాయి గణేష్ నుండి మరణ వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
సాయి గణేష్ మీడియాకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు సాయి ఆత్మహత్యతో ఖమ్మంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఖమ్మం టూర్ ను మంత్రి కేటీఆర్ రద్దు చేసుకొన్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్తలు చించివేయడంతో పాటు ఆసుపత్రిపై కూడా దాడికి దిగారు.
