నిజామాబాద్ కార్పొరేషన్ కు చెందిన పలువురు బీజేపీ మరియు కాంగ్రెస్ కార్పొరేటర్లు గురువారం టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వేముల వారందరికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

నిజామాబాద్ కార్పొరేషన్ కు చెందిన 25 వ డివిజన్ కార్పొరేటర్ సిరిగాదా ధర్మపురి(బిజెపి), 40 వ డివిజన్ కార్పొరేటర్ న్యామతాబాద్ శివచరన్(కాంగ్రెస్) లు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ...ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన నచ్చి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు,నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. వీరందరికీ టిఆర్ఎస్ పార్టీ పక్షాన,నా పక్షాన హృదయ పూర్వక స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు.

వారి డివిజన్ల అభివృద్ధి కోసం పార్టీలో చేరారన్న మంత్రి, వారి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాగుకోసం ఆలోచన చేస్తారని.. ఆయన ఆలోచన వల్ల రైతులకు మేలు జరుగుతుందని ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు.

అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ద్వారా బీడు భూముల్లోకి నీటిని మళ్లించి కేసీఆర్ వాటిని సస్యశ్యామలం చేశారని మంత్రి ప్రశంసించారు. 300 మీటర్ల లోతున ఉన్న నీటిని పంట భూముల్లోకి తెచ్చి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ముఖ్యమంత్రి రైతులకు అండగా నిలిచారని ఆయన గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి దూరదృష్టి వల్ల ఇవాళ తెలంగాణ లో పంటల దిగుబడి పెరిగి దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. రైతులు అందరూ ఒకే పంటను వేయడం ద్వారా పంటను అమ్ముకునేటప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుందని, అలాంటి పద్ధతికి స్వస్థి పలికి నియంత్రిత పద్దతిలో పంట సాగు చేసుకోవాలని ముఖ్యమంత్రి కోరుతున్నారని వేముల అన్నారు.

మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే మంచి ధరకు పంటను అమ్ముకోవచ్చునని, అందువల్ల రైతులు లాభసాటి పంటల వైపు మొగ్గు చూపాలని ప్రశాంత్ రెడ్డి సూచించారు. కేసీఆర్ సూచనలు పాటించి లాభాలు అందుకోవాలని వేముల కోరారు.

సీఎం ఆలోచన మేరకు రైతులు తమ పంటకు ధరను తామే నిర్ణయించుకుని నచ్చిన ధరకు అమ్ముకునే విధంగా ఉండాలని చెప్పారు. కేసీఆర్ పాలన విధానం నచ్చే వివిధ పార్టీలకు చెందిన నాయకులు టిఆర్ఎస్ లో చేరుతున్నారని వేముల అన్నారు.