నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ నేతల నుంచే ఆయనకు నిరసన సెగ తగిలింది. ఇంతకీ మ్యాటరేంటంటే... మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయమై పార్టీ కార్యకర్తల అభిప్రాయం తెలుసుకునేందుకు జానారెడ్డి అక్కడికి వెళ్లారు.

కాగా.. ఎస్టీలకే మిర్యాలగూడ సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తూ జానారెడ్డి సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పార్టీని నమ్ముకొని ఏళ్ల తరబడి ఉన్నవారికి కాకుండా ఇటీవల పార్టీలో చేరిన కొత్తవారికి టికెట్ ఇస్తే ఊరుకోమంటూ స్పష్టం చేశారు.

మొదటి నుంచి కాంగ్రెస్ లోనే పనిచేస్తేన్న గిరిజన నేతలు స్కైలాబ్ నాయక్, శంకర్ నాయక్ లకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. కార్యకర్తలు సమావేశాన్ని బహిష్కరించారు. జానారెడ్డి ఎంత నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. దీంతో కార్యకర్తల తీరుపై జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో రెచ్చిపోయిన కార్యకర్తలు.. జానారెడ్డి ప్రచారరథాన్ని ధ్వంసం చేశారు. ఆయన రాకకోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు.