నిజామాబాద్: యావత్ దేశం ఇప్పటికీ కరోనా మహమ్మారితో పోరాడుతున్న సమయంలో బర్డ్ ప్లూ రూపంలో కొత్తమహమ్మారి కలకలం మొదలయ్యింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ బర్డ్ ప్లూ కారణంగా వేలాది కోళ్ళు మృత్యువాతపడగా తాజాగా తెలంగాణలో కూడా ఇది భయాందోళనకు కారణమయ్యింది. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో బర్డ్‌ఫ్లూ కలకలం రేగింది.

యానంపల్లి గిరిజన తండాలోని ఓ పౌల్ట్రీఫామ్‌లో వేలాది కోళ్లు మృతి చెందడం ఈ భయాందోళనకు కారణమవుతోంది. రాంచందర్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న పౌల్ట్రీఫామ్ లో బుధ,గురువారాల్లో రెండువేలకు పైగా కోళ్లు మృతిచెందాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బర్డ్ ప్లూ వ్యాప్తి చెందుతున్న సమయంలో ఇలా వేలాది కోళ్లు చనిపోవడం అనుమానాలకు తావిస్తోంది. బర్డ్ ప్లూ కారణంగానే కోళ్లు చనిపోయి వుంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

read more  బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్... భారీగా పడిపోయిన చికెన్ ధరలు..!

దీనిపై సమాచారం అందుకున్న జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ భరత్‌, ఏడీ దేశ్‌పాండే, పశువైద్యాధికారి డాక్టర్‌ గోపీకృష్ణ పౌల్ట్రీ ఫామ్‌కు చేరుకొని కోళ్ల కళేబరాలను పరిశీలించారు.  బతికున్న కోళ్ల రక్తనమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు తరలించారు. రిపోర్టు వచ్చేవరకు తాము కచ్చితమైన కారణాలు చెప్పలేమన్నారు.