బిల్కిస్ బానో కేసు : వైరల్ అవుతున్న స్మితా సబర్వాల్ వరుస ట్వీట్లు.. గీత దాటారంటూ వివాదం..

బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయడం దారుణమంటూ తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వరుస ట్వీట్లు చేస్తుండడం.. వైరల్ గా మారుతోంది. దీంతో ఆమె గీతదాటారంటూ కొందరు అధికారులు అంటున్నారు. 

Bilkis Ban case : Smita Sabharwal's series of tweets going viral

హైదరాబాద్ : తెలంగాణ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ గీత దాటారంటూ చర్చ నడుస్తోంది. గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానోపై అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో 11 మంది  దోషులకు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. ఈ 11 మందికి  గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించి, విడుదల చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. వీరి క్షమాభిక్షకు వ్యతిరేకంగా తెలంగాణ కేడర్ సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ట్విట్టర్ వేదికగా మూడు రోజులుగా ప్రచారోద్యమం నిర్వహిస్తున్నారు.

‘వాళ్లకు ఉరితాళ్లే సరి. పూలదండలతో సన్మానాలు కాదు. వారి క్షమాభిక్షను రద్దు చేసి మా నమ్మకాన్ని పునరుద్ధరించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుతో పాటు రాజ్యాంగ అధిపతుల కు విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఆమె ఆదివారం మరో ట్వీట్ చేశారు. గోద్రా జైలు నుంచి విడుదలైన తరువాత వారిని కొందరు పూలదండలతో సత్కరించి, మిఠాయిలు తినిపించడం.. ఆ తర్వాత కొన్ని సంస్థలు సన్మానాలు చేయడం పట్ల చాలామంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇదే కోవలో స్మితాసబర్వాల్ సైతం స్పందించారు.

Bilkis Bano Case : నేరస్తుల విడుదల వార్త విని నమ్మలేకపోయా.. షాక్ అయ్యా.. స్మితా సబర్వాల్

గీత దాటారు అంటూ..
‘ఒక మహిళగా, సివిల్ సర్వెంట్గా ఈ వార్తలు చదువుతున్నప్పుడు నమ్మలేకపోయాను. భయం లేకుండా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే Bilkis bano హక్కులను హరించి, మనల్ని మనం స్వేచ్ఛ దేశంగా పిలుచుకోలేం’ అని రెండురోజుల కింద ఆమె చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఆమె ధైర్యాన్ని చాలామంది ప్రశంసించారు. ఐఏఎస్ అధికారిగా ఉండి, ఓ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటం సర్వీసు నిబంధనలకు విరుద్ధమని మరి కొందరు ఆమెను విమర్శిస్తున్నారు.

దానికి ఆమె ‘ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ అధికారుల వాక్ స్వేచ్ఛను హరించే సర్వీసు నిబంధనలను రద్దు చేయాల్సిన సమయం వచ్చింది’ అంటూ చేసిన మరో ట్వీట్ సైతం వైరల్ గా మారింది. వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ తో అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో తప్పు లేదని కొందరు ఐఏఎస్ అధికారులు ఆమెకు అండగా నిలుస్తున్నారు. గీత దాటారని మరికొందరు సహచరులు తప్పుబడుతున్నారు. ఇక గుజరాత్ ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఇస్తున్న వాళ్లు సోషల్ మీడియాలో  ఆమెపై ప్రతి దాడి చేస్తున్నారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios