Asianet News TeluguAsianet News Telugu

బీహార్ పరిణామాలతో కొత్త అస్త్రం.. జాతీయ రాజకీయాల్లో మరింత దూకుడు పెంచనున్న కేసీఆర్!

బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ వేదిక కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా  బీహార్‌ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలతో కేసీఆర్ ఆ దిశగా మరింత దూకుడు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 

Bihar ploitical developments gives boost to KCR to speed up national plan
Author
First Published Aug 11, 2022, 11:44 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై కొంతకాలంగా పోరు సాగిస్తున్న సంగతి  తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీపై, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ వేదిక కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పలు విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా ఆ ప్రయత్నాలు నెమ్మదించినట్టుగా తెలస్తోంది. అయితే తాజాగా  బీహార్‌ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలు.. కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా భావసారూప్యత కలిగిన పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయడానికి అవకాశాన్ని కల్పించాయి.

బీజీపీకి కటీఫ్ చెప్పిన నితీష్ కుమార్.. ఆర్జేడీతో చేతులు కలిపి బీహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీహార్‌ సీఎం నితీష్ కుమార్‌ను, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ను కలిసేందుకు కేసీఆర్ త్వరలోనే బిహార్‌కు వెళ్లనున్నట్టుగా టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. 2020 జూన్‌లో గల్వాన్ లోయ ఘర్షణలో వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు.. రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి  తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఇప్పటికే కొందరు జవాన్ల కుటుంబాలకు సాయం అందజేశారు. అయితే  గాల్వాన్‌లో పోరాడి వీరమరణం పొందిన బీహార్‌కు చెందిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయలేదు. ఈ క్రమంలోనే త్వరలోనే బీహార్‌ వెళ్లనున్న.. రాజకీయ అంశాలు చర్చించడంతో పాటు, జవాన్ల కుటుంబాలకు సాయం అందజేయనున్నట్టుగా తెలుస్తోంది. 

ఇక, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశాన్ని కేసీఆర్‌, నితీశ్‌ కుమార్‌లు ఇద్దరూ బహిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఇది యాదృచ్ఛికం కాకపోవచ్చునని టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. ఇక, కొన్ని నెలల కిందట తేజస్వి యాదవ్.. హైదరాబాద్‌‌కు వచ్చి ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించారు. బీజేపీకి వ్యతిరేక పోరాటంపైనే ఈ భేటీలో ప్రధానంగా చర్చ సాగినట్టుగా సమాచారం.

అయితే తాజాగా బీహార్‌లో చోటుచేసుకున్న పరిణామాలను పలువురు విపక్ష నేతలు మద్దతు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, యూపీ అసెంబ్లీలో విపక్షనేత, సమాజ్ వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌లు.. బిహార్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలిపారు. బీహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నితీష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘2014లో అధికారంలోకి వచ్చిన వారు.. 2024లో విజయం సాధిస్తారా?.. 2024 నాటికి అందరూ (ప్రతిపక్షాలు) ఏకం కావాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ఈ పరిణామాలు.. బీజేపీపై వ్యతిరేక పోరులో కేసీఆర్ ప్రణాళికలకు ఊతమిచ్చేలా కనిపిస్తున్నారు.    

ఇక, బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ నిర్మాణంలో కేసీఆర్‌కు దిశానిర్దేశం చేయడంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు. 

అయితే బీహార్‌ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆయన కార్యాలయం నుంచి కూడా ఇందుకు సంబంధించి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అయితే కేసీఆర్ కుమారుడు, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాత్రం.. తాజా పరిణామాలపై స్పందించారు. తేజస్వి యాదవ్‌కు అభినందనలు  తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘‘ఎన్డీఏ నుంచి జేడీయూ నిష్క్రమించిన తర్వాత.. ఎంతమంది కూటమి భాగస్వాములు మిగిలారు. సీబీఐ, ఐటీ, ఈడీ కాకుండా..’’ అంటూ బీజేపీని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios