తెలంగాణలో బలోపేతం ఆయ్యేందుకు బిజెపి పార్టీ ఓ వైపు దృష్టి పెట్టగా.... మరోవైపు పార్టీ నేతల్లో ఆధిపత్య పోరు మొదలైంది. రాష్ట్ర పార్టీ నేతల్లో ఇప్పటివరకు కనిపిస్తున్న సమన్వయ లోపం జిల్లాలకు విస్తరిస్తోంది.

ఓ వైపు జాతీయస్థాయిలో ఆ పార్టీ బలోపేతం అవుతున్నా... తెలంగాణలో మాత్రం పార్టీకి ఆశించిన ఫలితాలు ఇప్పటివరకు దక్కడం లేదు. గత అసెంబ్లీలో కమలానికి ఐదుగురు శాసన సభ్యులుండగా.... 2018 ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది.

Also Read:తేలని తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి: పెద్ద సవాలే

పార్లమెంట్ ఎన్నికల నాటికి మోడీ హవా..... కేంద్ర ప్రభుత్వ విధానాలు, జాతీయ నేతల వ్యూహాలతో 4 స్థానాలను గెలుచుకుంది.అదే ఊపులో మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ కి మంచి ఫలితాలు వస్తాయని బీజేపీ నేతలు భావించారు. కానీ ఫలితాలు అందుకు పూర్తిగా విరుద్ధంగా వచ్చాయి. రాష్ట్రంలోనీ 123  మున్సిపాలిటీల్లో, 10 కార్పోరేషన్లలో కేవలం రెండు స్థానాలను మాత్రమే బీజేపీ దక్కించుకోగలిగింది.

దీనికి తోడు ఫలితాల అనంతరం పలు జిల్లాల్లో బిజెపి నేతలు తమ పార్టీ నేతల వైఖరిని బహిరంగంగానే ఎండగడుతున్నారు. పార్టీ నేతలు వ్యవహరించిన తీరు కారణంగానే మున్సిపాలిటీల్లో పూర్తి స్థాయిలో ఫలితాలను రాబట్టలేకపోయామని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకున్న కమలనాథులు పార్లమెంటు నియోజకవర్గాల్లోని మున్సిపాల్టీ లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అయినా ఫలితం దక్కలేదని చెప్పుకోవచ్చు. ఆయా నియోజకవర్గాల్లో ఒక్క మున్సిపాలిటీ కూడా ఇప్పటివరకు బీజేపీ ఖాతాలో పడలేదు.

Also Read:పనిచేయకుంటే పదవులు పోతాయి..గెలిచినోళ్లంతా యాదికుంచుకోండి: కేటీఆర్ వార్నింగ్‌

రంగారెడ్డి జిల్లాలోని రెండు మున్సిపాలిటీలు మాత్రం పార్టీకి ఉన్న కారణంగా మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నేతలు వ్యవహరించిన తీరు కారణంగా విజయం సాధించలేక పోయామని అంటున్నారు. నిజామాబాద్ మున్సిపాలిటీ లో అతి పెద్ద పార్టీగా అవతరించినా ఆ స్థానాన్ని కైవసం చేసుకోలేకపోయింది.

అదిలాబాద్ జిల్లాలో జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ వ్యవహరించిన తీరుతో పార్టీ విజయావకాశాలను కోల్పోయిందని నేతలు బహిరంగంగా ఆరోపణలకు దిగారు. శంకర్‌ను మార్పు చేయకపోతే తాము పార్టీ వీడుతామని పార్టీ హైకమాండ్ కు నేతలు హెచ్చరికలు జారీ చేశారు.