Asianet News TeluguAsianet News Telugu

బిగ్ న్యూస్ : రైతు బంధు పంపిణీకి బ్రేక్.. అనుమతి రద్దు చేసిన ఈసీ...

రెండు రోజుల్లో ఎన్నికలు ఉండగా ఇప్పుడు నిధులు విడుదల చేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని ఈసి స్పష్టం చేసింది. దీంతో రైతుబంధు నిధుల పంపిణీ ఆగిపోయింది. 
 

Big News : Break for distribution of Rythu Bandhu, EC revoked permission - bsb
Author
First Published Nov 27, 2023, 9:54 AM IST

హైదరాబాద్ : తెలంగాణలో రైతుబంధును నిలిపివేయాలంటే కేంద్ర ఎన్నికల కమిషన్  తాజాగా ఆదేశాలు జారీ చేసింది. గతవారం రైతుబంధు నిధుల పంపిణీకి అనుమతినిచ్చిన ఎన్నికల సంఘం ఇప్పుడు అనుమతిని ఉపసంహరించుకుంది. దీంతో బీఆర్ఎస్ సర్కారుకు భారీ షాక్ తగిలినట్లు అయింది. అంతకుముందు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రైతుబంధు నిధుల పంపిణీ ఆపివేయాలంటూ ఎన్నికల సంఘం ఆదేశించింది. దీనిపై  బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు ప్రతిపాదనలు పంపడంతో నిధుల విడుదలకు అనుమతినిచ్చింది. నవంబర్ 28వ తేదీ లోపు రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని సూచించింది.

ఈ మేరకు 28వతేదీ నాడు సుమారు 7000 కోట్ల రూపాయల రైతుబంధు నిధులు 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయ్యింది. అయితే సోమవారం నాడు వెలువడిన తాజా ఆదేశాలతో రైతుబంధు నిధుల పంపిణీ నిలిచిపోయింది. రెండు రోజుల్లో ఎన్నికలు ఉండగా ఇప్పుడు నిధులు విడుదల చేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని ఈసి స్పష్టం చేసింది. దీంతో రైతుబంధు నిధుల పంపిణీ ఆగిపోయింది. 

మొదట రైతుబంధు నిధుల పంపిణీని ఆపివేసి, ఆ తర్వాత మళ్లీ అనుమతి ఇవ్వడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ కు దీనిమీద ఫిర్యాదులు వెల్లువెత్తాయి.  30వ తేదీ పోలింగ్ పెట్టుకొని.. 28వ తేదీ లోపు రైతుబంధు నిధులకు అనుమతి ఇవ్వడమేమిటంటూ.. ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ అనుమతి ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తోంది. 

ఆదివారం ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ హరీష్ రావు సోమవారం రైతుల ఖాతాల్లో ఉదయం కల్లా రైతుబంధు జమ అవుతుందని ప్రకటించారు. కానీ సోమవారం గురుపౌర్ణిమ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంది. ఇది కూడా ఒక కారణంగా తెలుస్తోంది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios