ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన నవదంపతులను రోడ్డు ప్రమాదం చిదిమేసింది. దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం  అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపివుంచిన లారీని ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలిద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

ఈ విషాద సంఘటన భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. గుండాల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన నరేష్ కు భువనగిరి మండలం కేసారం గ్రామానికి చెందిన దివ్య కు 20 రోజుల క్రితం వివాహమయ్యింది. హైదరాబాద్ లో అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేసే నరేష్ పెళ్ళి తర్వాత భార్యాను తన వెంట తీసుకెలదామని భావించాడు. అయితే మరికొద్దిరోజుల్లో డిగ్రీ పరీక్షలుండటంతో ఆమెను పుట్టింట్లోనే వుంచి ఒంటరిగానే హైదరాబాద్ కు చేరుకున్నాడు.

 గత ఆదివారం సెలవురోజు కావడంతో భార్యను కలుసుకోడానికి అత్తవారింటికి వెళ్లాడు. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరు కలిసి దగ్గర్లోని ఓ ఆలయానికి వెళ్లారు. రాత్రి అక్కడే బస చేసి సోమవారం తెల్లవారుజామున బైక్ పై ఇంటికి తిరిగి వస్తుండగా కుమ్మరిగూడెం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు పక్కన నిలిపి వుంచిన లారీని బైక్ ఢీకొట్టండంతో భార్యాభర్తలిద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

ఈ ఘటనపై స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  పెళ్లయి నెల రోజులు కూడా గడవక ముందే ఇలా భార్యాభర్తలిద్దరు మృతిచెందడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.