ప్రధాని నరేంద్ర మోడీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ: మూసీ ప్రక్షాళన సహా పలు అంశాలపై చర్చ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ భేటీ అయ్యారు. మూసీ ప్రక్షాళనతో పాటు ఇతర అంశాలపై ప్రధానితో చర్చించనున్నట్టుగా ఎంపీ వెంకట్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం నాడు భేటీ అయ్యారు. మూసీ ప్రక్షాళన, విజయవాడ-హైద్రాబాద్ జాతీయ రహదారి విస్తరణ పనుల విషయమై ప్రధానితో చర్చించనున్నట్టుగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.ప్రధానితో భేటీ అనంతరం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలపై తమ మధ్య ఎలాంటి చర్చ జరగలేదన్నారు. రాష్ట్రంలోని సమస్యలపై ప్రధానితో మాట్లాడినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.
మూసీ ప్రక్షాళన, హైద్రాబాద్ -విజయవాడ హైవేను ఆరు లేన్లుగా విస్తరించే విషయమై చర్చించినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. తాను లేవనెత్తిన సమస్యలపై ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. అధికారులతో మాట్లాడి త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామని ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు. భువనగిరి, జనగామ రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని కూడ కోరినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.హైద్రాబాద్ ఎంఎంటీఎస్ ను జనగామ వరకు పొడిగించాలని కోరినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.ఎన్నికలకు ముందే రాజకీయాల గురించి మాట్లాడుతానన్నారు. ఎంపీగా పోటీ చేస్తానా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా అనేది త్వరలోనే చెబుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
also read:కారణమిదీ: రేపు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రెండు రోజుల క్రితమే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, టీపీసీసీ కమిటీల నియామకం విషయమై చర్చించారు. ఈ సమావేశం జరిగిన రెండ రోజులకే ప్రధానితో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం ఇచ్చారు.ఈ సమాధానంపై కాంగ్రెస్ పార్టీ ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు తాను దూరంగా ఉంటున్నట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.
ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీన కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు.ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు. తన సోదరుడు కాంగ్రెస్ పార్టీని వీడినా తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని గతంలో ప్రకటించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.