రైతులకు 15 గంటలు విద్యుత్ సరఫరా చేస్తే రాజీనామా:హరీష్, కేటీఆర్ లకు కోమటిరెడ్డి సవాల్
రైతులకు ఉచితంగా 15 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసినట్టుగా రుజువు చేస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్:రైతులకు ఉచితంగా 15 గంటల విద్యుత్ ఇచ్చినట్టు రుజువు చేస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లకు భువనగిరి ఎంపీ సవాల్ విసిరారు. తన సవాల్ ను స్వీకరించాలని ఆయన కోరారు.
శుక్రవారం నాడు నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు 24 గంటల పాటు విద్యుత్ అందిస్తున్నట్టుగా ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారం చేస్తుందన్నారు. 24 గంటల విద్యుత్ కాదు కదా.. కనీసం 15 గంటల పాటు రైతులకు విద్యుత్ సరఫరా చేసినట్టుగా రుజువు చేయాలని ఆయన మంత్రులను డిమాండ్ చేశారు. రుజువు చేయలేకపోతే రైతులకు క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. చివరి వరకు అధికారం కోసం పాకులాడే బీఆర్ఎస్ నేతలు మంత్రి పదవులకు రాజీనామాలు చేయలేరని ఆయన ఎద్దేవా చేశారు. రైతులను తప్పుడు ప్రచారంతో మోసం చేసినందుకు క్షమాపణలు కోరాలని తాను అడుగుతున్నట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఒకవేళ రైతాంగానికి 15 గంటల విద్యుత్ ఇచ్చినట్టుగా రుజువు చేస్తే తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు.
సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ లలో ఏ సబ్ స్టేషన్ కైనా తాను వస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్టుగా రుజువు చేయాలని ఆయన కోరారు. గతంలో కూడ వ్యవసాయానికి కేసీఆర్ సర్కార్ 24 గంటల పాటు విద్యుత్ ను సరఫరా చేయడం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొల్లేపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ లో విద్యుత్ సరఫరా వివరాలను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బయట పెట్టారు. ఆ తర్వాత నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని అప్పాజీపేటలో కూడ రైతాంగానికి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా కానీ విషయాన్ని ఆయన మీడియా దృష్టికి తీసుకు వచ్చారు.
అమెరికా పర్యటనలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ రాజకీయంగా లబ్దిపొందే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. 24 గంటల పాటు రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసినట్టుగా బీఆర్ఎస్ సర్కార్ ప్రచారం చేసుకోవడాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్పు బట్టారు.