Asianet News TeluguAsianet News Telugu

మీరు వెదవలు.. దున్నపోతులు

  • అధికారులపై  కలెక్టర్ తిట్ల దండకం
  • విధుల్లో నిర్లక్యం కారణంగా ఎంపిడిఓ సస్పెన్షన్
  • మరో వివాదంలో భూపాలపల్లి కలెక్టర్ మురళి
  • భగ్గుమంటున్న కింది స్థాయి అధికారులు
bhupalpally collector murali finds himself again in the eye of storm

తెలంగాణలో మంచిపేరున్న కలెక్టర్ల జాబితాలో జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ ఆకునూరి మురళి కూడా ఉంటారు. కానీ ఆయన కొన్నిసార్లు వివాదాల్లో కూడా చిక్కుకుని ఇబ్బందలుపాలవుతున్నారు. తాజాగా ఆయన మరో పెద్ద వివాదంలో ఇరుక్కుపోయారు. ఆయన నోరు జారడంతోనే ఈ వివాదం రేగినట్లు కిందిస్థాయి ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. దీంతో జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ మురళి వివాదంలో నిలిచారు. పూర్తి వివరాలు కింద చదవండి.

ఎంపిడిఓలను జిల్లా కలెక్టర్ మురళి తీవ్రమైన భాషలో దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ‘‘ వెధవలు, పనీపాట రాని దున్నపోతులు, ఎక్కువ జీతం తీసుకుంటున్నారు, కొంచెం పని కూడా చేతగాదు, మిమ్మల్నందర్నీ ఏంచేయాలి? సస్పెండ్‌ చేయమంటారా..?’’ అంటూ తిట్ల వర్షం కురిపించినట్లు ఎంపిడిఓలు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ భాష తీరుపై జిల్లా పరిషత్‌ సీఈవోకు ఎంపిడిఓలు వినతిపత్రం అందించారు. అంతేకాదు జిల్లావ్యాప్తంగా బుధవారం సామూహిక సెలవు పెట్టారు. దీంతో జిల్లాలో ఈ అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.

ఎంపీడీవోలు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం(ఓడీఎ్‌ఫ)లో మండల పారిశుధ్య అధికారులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ ఓడీఎ్‌ఫను పర్యవేక్షిస్తున్నారు. ఈ సమావేశంలోనే ఎంపిడిఓలతో దురుసుగా మాట్లాడినట్లు వారు చెబుతున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కిందిస్థాయి సిబ్బంది సమక్షంలోనే దుర్భాషలాడుతుండడంతో తాము పనిచేసే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ తీరును నిరసిస్తూ బుధవారం నుంచి సామూహిక సెలవు పాటిస్తున్నామని, తదుపరి కార్యాచరణ వెల్లడిస్తామని ఎంపీడీవోలు పేర్కొన్నారు. 

 

గణపురం ఎంపీడీవోపై సస్పెన్షన్‌ వేటు

జయశంకర్‌ జిల్లా గణపురం ఎంపీడీవో శ్రీధర్‌స్వామిని కలెక్టర్‌ బుధవారం సస్పెండ్‌ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఓడీఎ్‌ఫపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌కు శ్రీధర్‌స్వామి హాజరుకాలేదు. సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ చేసి ఉండడంతో ఆగ్రహించిన కలెక్టర్‌ ఆయన్ను సస్పెండ్‌ చేశారు. అలాగే గణపురం మండలంలో మరుగుదొడ్ల నిర్మాణంలో వెనుకబడి ఉండడంతో పాటు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతోనే ఎంపీడీవోపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు సమాచారం. మొత్తానికి గణపురం ఎంపిడిఓ శ్రీధర్ స్వామి సస్పెన్షన్ విషయంలోనే వివాదం మొదలై... ఎంపిడిఓలంతా ఏకమై కలెక్టర్ మీద ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.కలెక్టర్ మురళి గతంలోనూ బీఫ్ తినండి అంటూనే.. మాంసం తినని వాళ్లపై తీవ్రమైన విమర్శలు చేశారు. దీంతో అప్పట్లో హిందూత్వవాదులంతా కలెక్టర్ పై విరుచుకుపడ్డారు. ఆ వివాదంలోంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న మురళి మరో వివాదంలో చిక్కుకున్నారు.

 

 

కలెక్టర్ మురళి ప్రజల మనిషి

జిల్లాలో కలెక్టర్ మురళి కి మంచిపేరుంది. ఆయన ప్రజల మనిషిగా మెలుగుతూ వచ్చారు. తన సొంత కూరుతు ప్రసవం ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కాలినడకన, సైకిల్ మోటర్ మీద గ్రామాలు, తండాలు తిరుగుతూ వారితో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించేవారు. కష్టపడి పనిచేసే స్వభావం ఉన్న వ్యక్తిగా కలెక్టర్ మురళికి మంచిపేరే ఉంది. ఒకసారి ఫారెస్టులో ఆయన పోతుంటే మంటలు చెలరేగాయి. దీంతో ఆయన కారు దిగి స్వయంగా మంటలు ఆర్పే పనిలో మునిగిపోయారు. సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లో తిరుగుతూ కొత్త ఒరవడి తీసుకొచ్చారు. కానీ.. అప్పుడప్పుడు ఇలా అనూహ్యంగా వివాదాల్లో చిక్కుతూ ఉంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios