తెలంగాణ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. భూముల రిజిస్ట్రేషన్ తో పాటు ఇతర వ్యవహారాల కోసం తీసుకువచ్చిన ఈ ధరణి, భూభారతి మధ్య పోలిక, తేడాలేమిటో ఇక్కడ చూద్దాం.
BHU BHARATI :అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీమేరకు తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా భూభారతిని తీసుకువచ్చింది. గత ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారతిని ప్రారంభించారు... పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి జిల్లాకో మండలంలో అమలుచేసారు. ఇందులో లోటుపాట్లను సరిచేసిన ప్రభుత్వం ఇక రాష్ట్రవ్యాప్తంగా భూభారతి చట్టాన్ని అమలుచేసేందుకు సిద్దమయ్యింది.
ఇకపై రైతుల వద్దకే అధికారులు వెళ్లి సమస్యల గురించి తెలుసుకుంటారని.. రైతుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజల వద్దకే రెవెన్యూ నినాదంలో జూన్ 3 నుండి 20వ తేదీవరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలకు ఎమ్మార్వోతో కూడిన రెవెన్యూ అధికారుల టీం వెళుతుందని తెలిపారు. ప్రజల భూసమస్యలను ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరిస్తూ భూభారతి చట్టాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళతామని మంత్రి పొంగులేటి తెలిపారు.
అయితే ధరణి ఉండగా ఈ భూ భారతిని కాంగ్రెస్ ఎందుకు తీసుకువచ్చారు? రెండు చట్టాలకు మధ్య పోలిక, తేడా ఏమిటి? ఏ చట్టంలో ఎలాంటి రూల్స్ ఉన్నాయి... ఇవి ప్రజలకు ఎలా ఉపయోగపడ్డాయి? తదితర వివరాలను తెలుసుకుందాం.
భూభారతి, ధరణికి పోలికలు, తేడాలివే :
1. ధరణిలో మాదిరిగానే భూభారతిలో కూడా భూముల మ్యూటేషన్, రిజిస్ట్రేషన్ అధికారం తహసీల్దార్లకే కల్పించారు. అంటే క్లియర్ టైటిల్ ఉంటే ఒకేసారి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ధరణిలో కూడా ఇలాగే జరిగేది.
2. ధరణిలో భూముల రకాలు, వివిధ సమస్యలను పరిగణలోకి తీసుకుని 33 మాడ్యుళ్లు అంటే దరఖాస్తు విధానాలు ఉండేవి. కానీ తాజా భూభారతిలో వీటిని కేవలం 6 కు కుదించారు. గతంలో దరఖాస్తు విధానాన్ని మార్చుకుంటే రైతు ప్రతిసారి రూ.1200 చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం ఉండదు.
3. ధరణిలో మ్యూటేషన్ ప్రక్రియపై విచారణ ఉండేది కాదు. కానీ భూభారతిలో మ్యూటేషన్ ప్రక్రియపై విచారణ ఉంటుంది.
4.భూభారతి ప్రత్యేకంగా భూధార్ గురించి ప్రస్తావించారు. అంటే ప్రతీ భూకమాతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తారన్నమాట. ఈ భూదార్ నంబర్లు భూముల రిజిస్ట్రేషన్ వేగంగా, సులభంగా, పాదర్శకంగా జరిగేలా చూస్తాయి. రైతులు, భూయజమానులకు వారి భూకమతాల గురించి స్పష్టమైన సమాచారాన్ని అందిస్తుంది. భూధార్ ద్వారా భూముల యజమానులకు ఎటువంటి అనుమానాలు లేకుండా హక్కు పత్రాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది.
5. భూమిత్ర అనే కొత్త విధానాన్ని భూభారతి ద్వారా తీసుకువచ్చారు. అంటే రైతులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సహాయం అందించనున్నారు. రైతులకు తమకు కావల్సిన సమాచారాన్ని చాలా సులభంగా ఈ ఏఐ బాట్ సాయంతో పొందవచ్చు. రైతులు ఇచ్చే వివరాలతో సరైన సమాచారం అందించేందుకు ఈ బాట్ తోడ్పడుతుంది.
6. భూపరిపాలన వికేంద్రీకరణలో భాగంగా గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను తిరిగి తీసుకువస్తున్నారు. రైతులు, గ్రామీణ ప్రజల భూరికార్డుల నిర్వహణ మరింత కట్టుదిట్టంగా, వేగవంతంగా నిర్వహించనున్నట్లు చెబుతున్నారు.
7. భూముల రిజిస్ట్రేషన్ సమయంలో డ్యాక్యుమెంట్లతో పాటు సర్వే మ్యాపును జరతపరిచే విధానాన్ని ఈ భూభారతి చట్టంలో పొందుపర్చారు. ఇందులో భాగంగా భూముల కొలతలు, భూదస్త్రాల నిర్వహణ శాఖను బలోపేతం చేయడానికి 6 వేలమంది సర్వేయర్లను నియమించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
8. భూ రిజిస్ట్రేషన్ సమయంలో మోసాలు, నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలను తయారుచేసుకున్నా ఈ రిజిస్ట్రేషన్ ను రద్దుచేసే అధికారం భూభారతి లో కలెక్టర్లకు కట్టబెట్టారు. కానీ ధరణిలో ఈ విధానం లేదు. అక్రమాలకు పాల్పడే ఎమ్మార్వోలను విధుల నుండి తొలగించడం, క్రిమినల్ చర్యలు చేపట్టేందుకు కలెక్టర్లకు అధికారం కల్పించారు.
9. గ్రామ కంఠం భూములకు కూడా పాస్ పుస్తకాలు జారీచేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
10. ధరణిలో భూముల వివరాలు బహిర్గతం, పహాణీలో భూముల వివరాలు, సాదా బైనామా క్రమబద్దీకరణ, భూముల రికార్డులు, సంఖ్య జారీ అవకాశం ఉండేది కాదు. కానీ భూభారతి ఈ అవకాశం కల్పించారు.
