Asianet News TeluguAsianet News Telugu

Bhoodan Pochampally: భూదాన్‌ పోచంపల్లికి అంతర్జాతీయ గుర్తింపు.. ఉత్త‌మ ప‌ర్యాట‌క గ్రామంగా ఎంపిక..

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని (Yadadri Bhuvanagiri district) భూదాన్ పోచంపల్లికి (Bhoodan Pochampally) అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఉత్తమ  పర్యాటక గ్రామంగా (best Tourism Village) ఎంపికైంది.

Bhoodan Pochampally Village in Telangana has been selected as one of the best Tourism Villages by UNWTO
Author
Hyderabad, First Published Nov 16, 2021, 4:39 PM IST

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని (Yadadri Bhuvanagiri district) భూదాన్ పోచంపల్లికి (Bhoodan Pochampally) అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా (best Tourism Village) ఎంపికైంది. ఐక్య‌రాజ్య స‌మితికి అనుబంధంగా ఉన్న ప్ర‌పంచ ప‌ర్యాట‌క సంస్థ‌.. భూదాన్ పోచంప‌ల్లిని ఉత్త‌మ ప‌ర్యాట‌క గ్రామంగా ఎంపిక చేసింది. డిసెంబర్ 2వ తేదీన  స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో(Madrid) భూదాన్ పోచంప‌ల్లి గ్రామానికి అవార్డును ప్ర‌దానం చేయ‌నున్నారు. చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన పోచంపల్లి భూదాన ఉద్యమంతో భూదాన్‌ పోచంపల్లిగా ప్రసిద్ధి చెందింది.

ఐక్యరాజ్యసమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అవార్డ్స్ 2021 (UNWTO).. 'బెస్ట్ టూరిజం విలేజ్'(ఉత్తమ పర్యాటక గ్రామం)  విభాగంలో భారత్ నుంచి భూదాన్ పోచంపల్లితో పాటుగా మధ్యప్రదేశ్‌కు చెందిన లధ్‌పురా ఖాస్, మేఘాలయలోని కొంగ్‌థాంగ్‌ నామినేట్ అయ్యాయి. వీటిలో భూదాన్ పోచంపల్లి ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. 

భూదాన్ పోచంపల్లి గ్రామం.. చారిత్రాత్మక ప్రాముఖ్యతను, గొప్ప సాంస్కృతిక చరిత్రను కలిగి ఉంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం.. మంచి పర్యాటక ప్రాంతంగా ఉన్న సంగతి తెలిసిందే. దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకు ఈ గ్రామాన్ని సందర్శిస్తుంటారు. ఇక్కడి నేసే చీరలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా (silk city of India) కూడా పోచంప‌ల్లిని పిలుస్తారు. ముఖ్యంగా చేతితో నేసిన ఇక్కత్ చీరలకు ఈ గ్రామం ప్రసిద్ధి చెందింది. 2005లో పోచంపల్లి చీరకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జిఐ) ట్యాగ్ కూడా వచ్చింది.

అప్పటి నుంచి భూదాన్ పోచంపల్లిగా..
సుప్రసిద్ద గాంధేయవాది ఆచార్య వినోబాభావే (Acharya Vinoba Bhave) పోచంపల్లికి రావడం..  ఆయన పిలుపు మేరకు వెదిరె రాంచంద్రారెడ్డి హరిజనులకు 100 ఎకరాల భూమి దానం చేయడంతో భూదానోద్యమానికి అంకురార్పణ జరిగింది. అప్పటి నుంచి ఈ గ్రామం పేరు భూదాన్‌పోచంపల్లిగా మారింది. చరిత్రలో నిలిచిపోయింది.

Follow Us:
Download App:
  • android
  • ios