తొమ్మిదన్నరేళ్ల తర్వాత ఇన్నాళ్లకు కేసీఆర్‌కు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గుర్తుకొచ్చారా అంటూ దుయ్యబట్టారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల హక్కులను కేసీఆర్ కాలరాస్తున్నారని.. కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. అరెస్ట్ చేసిన నేతలను తక్షణం విడుదల చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. తొమ్మిదన్నరేళ్ల తర్వాత ఇన్నాళ్లకు కేసీఆర్‌కు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గుర్తుకొచ్చారా అంటూ దుయ్యబట్టారు.
తెలంగాణ ద్రోహులను సీఎం తన పక్కన పెట్టుకుంటున్నారని.. తప్పులను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిలదీశారు. తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ప్రియాంకా గాంధీని కోరుతామని.. 33 జిల్లాల్లో పర్యటించాలని కోరుతామన్నారు. కాంగ్రెస్‌లో నేతలమంతా విభేదాలు మరిచిపోయి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని కోమటిరెడ్డి వెల్లడించారు.
ALso Read: చేరికలపై ఎలాంటి విభేదాలు లేవు.. కలిసి పనిచేస్తాం: కోమటిరెడ్డితో రేవంత్ భేటీ..
మరోవైపు.. తెలంగాణ కాంగ్రెస్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌లో చేరికల విషయంలో కొందరు నేతల నుంచి అభ్యంతరాల వ్యక్తం అవుతున్నాయనే ప్రచారం నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డిలు కొద్దిసేపు చర్చించుకున్నారు. అనంతరం ఇరువురు నేతలు కలిసి అక్కడి నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లారు.
అయితే జూపల్లి ఇంటికి బయలుదేరే సమయంలో మీడియాతో మాట్లాడిన ఇరువురు నేతలు.. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తాను, రేవంత్ రెడ్డి రోజు మాట్లాడుకుంటామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కలిసి పనిచేస్తామని చెప్పారు.
