ఉమ్మడి నల్గొండ  జిల్లాలో కాంగ్రెస్‌లో చేరికల విషయంలో కొందరు నేతల నుంచి అభ్యంతరాల వ్యక్తం అవుతున్నాయనే ప్రచారం నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్‌లోని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసానికి వెళ్లారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌లో చేరికల విషయంలో కొందరు నేతల నుంచి అభ్యంతరాల వ్యక్తం అవుతున్నాయనే ప్రచారం నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్‌లోని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డిలు కొద్దిసేపు చర్చించుకున్నారు. అనంతరం ఇరువురు నేతలు కలిసి అక్కడి నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఆ తర్వాత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి కూడా వెళ్లనున్నారు. 

అయితే జూపల్లి ఇంటికి బయలుదేరే సమయంలో మీడియాతో మాట్లాడిన ఇరువురు నేతలు.. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తాను, రేవంత్ రెడ్డి రోజు మాట్లాడుకుంటామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కలిసి పనిచేస్తామని చెప్పారు.

మరోవైపు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రధాని మంత్రిని చేసేవరకు కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తారని అన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ నుంచి కనీసం 15 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు తాను, కోమటిరెడ్డి, ఇతర నాయకులు కలిసి పనిచేస్తామని చెప్పారు. వివాదాలు ఉన్న చేరికలు ఏవి ఉండవని చెప్పారు. 

నల్గొండలో చేరికలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జనారెడ్డిలతో సంప్రదింపులు లేకుండా జరగవని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావివ్వకూడదని అన్నారు. వివాదాలు ఉన్నట్టు అనడం సరికాదని అన్నారు. పార్టీలో చేరేందుకు ఎన్నో ప్రతిపాదనలు వస్తాయని.. అప్పుడు పార్టీలోని స్థానిక నాయకుల అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.