తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు.. ఇప్పటి సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలో ఎంతో తేడా కనిపిస్తోందన్నారు టీ.కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కొత్తగా ఎంపికైన ఎంపీలకు గాంధీభవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు సన్మానం చేశారు.

అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ.. 2014లో 14 మంది ఎంపీలున్నప్పటికీ టీఆర్ఎస్.. విభజన చట్టంలోని హామీల కోసం పోరాడలేదన్నారు. ముగ్గురు సభ్యులమే ఉన్నా... పార్లమెంటులో నిరంతరం పోరాటం చేస్తామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ మంచి స్థానాలు గెలిచేలా కృషి చేస్తామన్నారు. అధికారం వస్తుంది పోతుంది కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనడం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని.. లాభమే జరిగిందని కోమటిరెడ్డి తెలిపారు. 11 మంది శాసనసభ్యులు పోయినప్పటికీ ... కాంగ్రెస్ మరింత బలం పుంజుకుందని వెంకటరెడ్డి వెల్లడించారు.