Asianet News TeluguAsianet News Telugu

Bharat Jodo Yatra: చార్మినార్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi: చార్మినార్ వద్ద కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ప్రతి సంవత్సరం కాంగ్రెస్ చార్మినార్ వద్ద సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. శాంతి-మత సామరస్యానికి కృషి చేస్తున్న వ్యక్తులకు అవార్డులను అందజేస్తుంది.
 

Bharat Jodo Yatra: Rahul Gandhi hoists tricolour at Charminar in Hyderabad
Author
First Published Nov 1, 2022, 7:52 PM IST

Hyderabad-Charminar: కాంగ్రెస్ దేశ‌వ్యాప్త భార‌త్ జోడో యాత్ర ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కొన‌సాగుతోంది. దీనికి ప్ర‌జ‌ల నుంచి భారీ స్పంద‌న ల‌భిస్తోంది. భారత్ జోడో యాత్రలో భాగంగా హైదరాబాద్‌కు ప్రతీకగా నిలిచే స్మారక చిహ్నం చార్మినార్ వద్ద కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం జాతీయ జెండాను ఎగురవేశారు. పార్టీ నాయకులు, వందలాది మంది పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి ఆయన తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం కాంగ్రెస్ చార్మినార్ వద్ద సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. శాంతి-మత సామరస్యానికి కృషి చేస్తున్న వ్యక్తులకు అవార్డులను అందజేస్తుంది.

హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో శాంతి, మత సామరస్యం కోసం సద్భావన యాత్రను ప్రారంభించేందుకు 1990 అక్టోబర్ 19న రాజీవ్ గాంధీ చార్మినార్‌ను సందర్శించిన జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహించబడింది.  రాహుల్ గాంధీ లాడ్ బజార్ రోడ్డు నుంచి స్మారక చిహ్నం వద్దకు చేరుకోగానే కొద్ది క్షణాలు ఆగి ఆ భవనాన్ని పరిశీలించి, దాని అందాలను తన కెమెరాలో బంధించి ముందుకు సాగారు. రాహుల్ గాంధీ తన తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సందర్భంగా వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు చార్మినార్ చుట్టూ చేరి పార్టీ అధినేతకు స్వాగతం పలికి 'జోడో జోడో, భారత్ జోడో', 'రాజీవ్ గాంధీ అమర్ రహే' అంటూ నినాదాలు చేశారు.

 

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఏ.రేవంత్‌రెడ్డి, సీనియర్‌ నేత వి.హనుమంతరావు, అంజన్‌కుమార్‌ యాదవ్‌, ఇతర నేతలు ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకున్నారు. చార్మినార్ వద్ద స్వల్పకాలిక కార్యక్రమం అనంతరం, చారిత్రాత్మకమైన పాతేర్‌గట్టి మార్కెట్ మీదుగా యాత్ర కొనసాగింది. ఆయనకు స్వాగతం పలికేందుకు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజల వైపు గాంధీ చేతులు ఊపుతూ కనిపించారు. యాత్ర రద్దీగా ఉండే కొన్ని ప్రాంతాలను దాటిన తర్వాత, భారత్ జోడో యాత్ర హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలను విభజించే హుస్సేన్ సాగర్ సరస్సు ఒడ్డున నెక్లెస్ రోడ్‌కు చేరుకుంటుంది. రాహుల్ గాంధీ నెక్లెస్ రోడ్‌లోని తన అమ్మమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, కార్నర్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు. నెక్లెస్ రోడ్డులో ఉన్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సమాధికి నివాళులు అర్పిస్తారని కాంగ్రెస్ నేత, తెలంగాణ ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ తెలిపారు.

అంతకుముందు మంగళవారం ఉదయం యాత్ర హైదరాబాద్‌లోకి ప్రవేశించింది. నారాయణపేట, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలను కవర్ చేసిన యాత్ర తెలంగాణలో ఏడో రోజు యాత్ర రాష్ట్ర రాజధాని హైద‌రాబాద్ కు చేరుకుంది. రాహుల్ గాంధీ, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నగర శివార్లలోని శంషాబాద్‌లోని మఠం ఆలయం నుండి పాదయాత్రను తిరిగి ప్రారంభించి బెంగళూరు-హైదరాబాద్ హైవే మీదుగా నగరంలోకి ప్రవేశించారు. బహదూర్‌పురలో యాత్రకు విశ్రాంతి ఇస్తూ నిలిచిపోయింది.  అక్కడ రాహుల్ గాంధీ మహిళలు, లింగమార్పిడి ప్రతినిధులు, పౌర సమాజ సంస్థలతో సహా వివిధ సమూహాలతో సమావేశమయ్యారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు యాత్ర తిరిగి పురానాపూల్, హుస్సేనీ ఆలం, ఖిల్వత్ రోడ్ల మీదుగా చార్మినార్‌కు చేరుకుంది.

భార‌త్ జోడో యాత్ర క్రమంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యాత్ర మార్గంలో ట్రాఫిక్‌ రాకపోకలపై ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్‌లోని బోవెన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో రాహుల్ గాంధీ రాత్రి బస చేస్తారు. నవంబర్ 4న ఒకరోజు విరామంతో నవంబర్ 7 వరకు తెలంగాణలో యాత్ర కొనసాగనుంది. రాష్ట్రంలోని 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల‌ను క‌వ‌ర్ చేస్తూ.. మొత్తం 375 కిలో మీట‌ర్లు  భార‌త్ జోడో యాత్ర కొన‌సాగ‌నుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios