భారత్ బంద్ (bharat Bandh)లో భాగంగా తెల ంగాణ కాంగ్రెసు నేతలు గుర్రపు బగ్గీపై అసెంబ్లీకి చేరుకున్నారు. అదే బగ్గీపై లోనికి వెళ్లడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.
హైదరాబాద్: భారత బంద్ (Bharat Bandh) సందర్భంగా తెలంగాణ కాంగ్రెసు నేతలు సోమవారం గుర్రపు బగ్గీపై శాసనసభకు చేరుకున్నారు. గుర్రపు బగ్గీపైనే లోనికి వెళ్తామని పట్టుబట్టిన కాంగ్రెసు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీని పోలీసులు అనుమతించలేదు. దాంతో వారు అక్కడే నిరసనకు దిగారు. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేసి హైదరాబాదులోని నారాయణగుడా పోలీసు స్టేషన్ కు తరలించారు.
సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క, జీవన్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. గుర్రపు బగ్గీపై వారు కాంగ్రెసు కార్యాలయం గాంధీ భవన్ నుంచి గుర్రపు బగ్గీపై ర్యాలీకి బయలుదేరి అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే, పోలీసులు లోనికి వెళ్లనీయలేదు. దాంతో వారు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రధాని మోడీ, కేసీఆర్ ఒక్కటేనని, అందుకే కేసీఆర్ భారత్ బంద్ కు మద్దతు ఇవ్వలేని మల్లుభట్టి విక్రమార్క విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి కేసీఆర్ భయపడుతున్నారని ఆయన అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయని ఆయన అన్నారు. టీఆర్ఎస్, బిజెపి ఒక్కటేనని జీవన్ రెడ్డి అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై తెలంగాణ ప్రభుత్వం తన వైఖరి చెప్పాలని సీతక్క డిమాడ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు నష్టపోతున్నారని ఆమె అన్నారు.
కేంద్ర ప్రభుత్వ కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ భారత్ బంద్ కు తెలంగాణ కాంగ్రెసు పార్టీ మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగానే కాంగ్రెసు నేతలు అసెంబ్లీకి గుర్రపు బగ్గీపై బయలుదేరారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జనగ్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ బంద్ కు మద్దతు ప్రకటించింది.

ఇదిలావుంటే, హైదరాబాదులోని కోఠీ సెంటర్ వద్ద ధర్నాకు దిగిన వామపక్షాల నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ ఆర్టీసీలో మాత్రం బంద్ ప్రభావం కనిపించడం లేదు. బస్సులు యధావిధిగా నడుస్తున్నాయి. ట్రాఫిక్ కు కూడా పెద్దగా అంతరాయం కలగడం లేదు.
