కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు విధానాలకు నిరసనగా రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సమ్మెకు సింగరేణి కార్మికుల నుంచి భారీ మద్దతు లభించింది.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు విధానాలకు నిరసనగా రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల సార్వత్రిక సమ్మెలో తొలి రోజు సోమవారం సమ్మెకు దేశంలోని పలుచోట్ల మిశ్రమ స్పందన లభించింది. తెలంగాణ విషయానికి వస్తే.. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, సింగరేణి, బ్యాంకులకు చెందిన వేల మంది ఉద్యోగులు, కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాల్లోని ఉత్పత్తి నిలిచిపోయింది.
సమ్మెకు సింగరేణి కార్మికుల నుంచి భారీ మద్దతు లభించింది. తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు విధులు బహిష్కరించారు. కార్మికులు లేక గనులు వెలవెలబోయాయి. బీఎంఎస్ మినహా CITU, AITUC, INTUCతో సహా అన్ని కేంద్ర కార్మిక సంఘాల జేఏసీగా ఏర్పడి సమ్మెకు పిలుపునిచ్చాయి. కోల్ బెల్ట్ ప్రాంతంలోని అనేక ప్రదేశాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. టీఆర్‌ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ సమ్మెకు బయటి నుంచి మద్దతు తెలిపింది. కొత్తగూడెం, గోదావరిఖని తదితర పట్టణాల్లో జరిగిన నిరసన ప్రదర్శనల్లో టీబీజీకేఎస్ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)ను నాశనం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బొగ్గు గని కార్మికుల వ్యతిరేక విధానాలను అవలంబిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వివిధ జాతీయ కార్మిక సంఘాల నాయకులు భూగర్భ, ఓపెన్‌కాస్ట్ గనులను సందర్శించి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సోమవారం మొదటి షిఫ్ట్ సమయంలో SCCLలోని మొత్తం 11 ప్రాంతాలలో అధిక సంఖ్యలో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. సోమవారం మొదటి షిఫ్ట్‌లో సింగరేణి గనుల్లో 21.03 శాతం హాజరు మత్రమే నమోదైందని.. ఇది రెండవ షిఫ్ట్‌లో 24.95 శాతానికి పెరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌లో సోమవారం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 ప్రాంతాలలో ఆరు భూగర్భ, నాలుగు ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనులలో మొత్తం 13,500 మంది కార్మికులు పని చేస్తున్నారు. essential services కార్మికులు మినహా మిగిలిన వారంతా విధులకు దూరంగా ఉన్నారు. దీంతో రెండు రోజుల సమ్మెలో భాగంగా సోమవారం తొలిరోజు దాదాపు 50 వేల టన్నలకు పైగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్టగా తెలుస్తోంది. సమ్మెతో కొత్తూగెడంలో 12,081, ఇల్లెందులో 9,240, మణుగూరు ఏరియాలో 24, 421 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లో సమ్మె వల్ల దాదాపు 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్టుగా అంచనా. అత్యవసర సిబ్బంది, ఇతర విభాగాల సిబ్బందితో కలిపి 20 శాతంలోపు ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరయ్యారు. భూపాలపల్లి ఏరియాలో సింగరేణిలో సమ్మె సంపూర్ణంగా జరిగింది. అత్యవసర సిబ్బంది మినహా మిగిలిన కార్మికులెవరూ విధులకు హాజరు కాలేదు. భూపాలపల్లి ఏరియాలోని నాలుగు భూగర్భ గనులు, రెండు ఓపెన్ కాస్టు గనుల్లో సమ్మె కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె నేపథ్యంలో గునులపై ఎటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.
