యాదగిరిగుట్ట: అత్తింట్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన అల్లుడు ఘటనకు సంబంధించిన కేసును పోలీసులు చేధించారు. ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి డీసీపీ కె.నారాయణరెడ్డి మీడియాకు వివరించారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజంపేట మండలం దూదివెంకటాపురంలో వారం రోజుల క్రితం ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో సజీవ దహనమయ్యాడు. ఈ ఘటనకు  సంబంధించి నిందితుల వివరాలను  పోలీసులు వివరించారు. 

దూది వెంకటాపురం గ్రామానికి చెందిన ఎర్రోళ్ల భాగ్యలక్ష్మి మోటకొండూరు మండలకేంద్రానికి చెందిన కొల్లూరు నరేష్‌కు 17 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఒక కొడుకు ముగ్గురు కూతుళ్లున్నారు. భాగ్యలక్ష్మికి మోటకొండూరుకు చెందిన వంగపల్లి అయిలయ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి.

దీంతో భాగ్యలక్ష్మి నాలుగేళ్ల క్రితం పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. పిల్లలను చూసేందుకు భర్త నరేష్ తరచూ వస్తూ తనను వేధింపులకు గురి చేయడంతో భాగ్యలక్ష్మి భర్త అడ్డు తొలగించుకోవాలని భావించింది. భర్త వల్ల ప్రియుడితో కలవడానికి ఇబ్బందిగా ఉందని భాగ్యలక్ష్మి అభిప్రాయంతో ఉంది. భర్తను హత్య చేయాలని ఆమె తలపెట్టింది. 

ఈ నెల 9వ తేదీన  పిల్లలను చూసేందుకు నరేష్ అత్తింటికి వచ్చాడు. మద్యం మత్తులో నరేష్ భార్య భాగ్యలక్ష్మితో గొడవపడ్డాడు. అనంతరం ఆయన ఇంటి ముందు మంచంలోనే పడుకొన్నాడు.  భాగ్యలక్ష్మి ఈ విషయాన్ని తన ప్రియుడు అయిలయ్యకు ఫోన్ చేసి చెప్పింది. అయిలయ్య భాగ్యలక్ష్మి ఇంటికి వచ్చాడు.

అయిలయ్య నరేష్ కాళ్లు పట్టుకోవడంతో భాగ్యలక్ష్మి దిండుతో నరేష్ ముఖంపై అదిమిపెట్టింది. నరేష్ మృతి చెందిన తర్వాత ఆయనపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.. నరేష్ ఆత్మహత్య చేసుకొన్నాడని భాగ్యలక్ష్మి స్థానికులకు చెప్పింది. మృతుడి తల్లి ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

ఈ విషయమై పోలీసులు విచారన జరిపితే భాగ్యలక్ష్మి అసలు విషయాన్ని బయటపెట్టింది. భాగ్యలక్ష్మితో పాటు ఆమె ప్రియుడు అయిలయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.