గత కొన్నిరోజులుగా తెలంగాణలో చోటు చేసుకున్న భారీ వర్షాలు, వరదల కారణంగా భద్రాచలం ప్రాంతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలవరం కాఫర్ డ్యాం ఎత్తు పెంపుతో ఈ ప్రాంత వాసులు భయాందోళన చెందుతున్నారు.
పోలవరం (polavaram project) కాఫర్ డ్యాం ఎత్తు పెంపుతో భద్రాచలం ప్రాంతంలో (bhadrachalam floods) భయాందోళనలు పెరిగాయి. గత వారం రోజుల నుంచి వచ్చిన వరద ఈ ప్రాంత వాసులను కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఇలాంటి పరిస్ధితుల్లో ఇప్పుడు మరింత పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెంచడాన్ని ఈ ప్రాంత వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. భద్రాచలాన్ని సంరక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) జోక్యం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలానికి ముప్పు పొంచి ఉందని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేశారు. మంగళవారం మంత్రి పువ్వాడతో (puvvada ajay kumar) కలిసి ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. పోలవరం నుంచి నీటి విడుదల ఆలస్యం వల్ల గోదావరి వరద ఉధృతి పెరిగిందని అన్నారు. పోలవరం ఎత్తు పెంపుతో భద్రాచలం వద్ద నిరంతరం 45 అడుగుల మేర నీటి ప్రవాహం ఉంటుందని చెప్పారు. పోలవరం వల్ల తెలంగాణ భూభాగానికి ముంపు ఉందని ముందు నుంచే చెబుతున్నామని అన్నారు. పోలవరం బ్యాక్ వాటర్‌లో పలు మండలాలకు ముప్పు ఉందని తెలిపారు. భద్రాచలానికి అనుకొని ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాల్సిందేనని అన్నారు. ఇక, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మిగిలిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇదేరకమైన కామెంట్స్ చేశారు.
మరోవైపు... ఈ వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పువ్వాడ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) ఘాటుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో విలీనమైన పోలవరం ముంపు గ్రామాలకు ఏం చేయాలో తమ ప్రభుత్వానికి తెలుసన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ అనవసర విమర్శలు మానుకోవాలని మానుకోవాలని సూచించారు. ఆ ముంపు గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తే.. ఆంధ్రప్రదేశ్ ను కూడా తెలంగాణలో కలపాలని అడుగుతామన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ విడిపోవడం వల్ల.. హైదరాబాద్ ద్వారా ఏపీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోయిందని, మరి ఇప్పుడు హైదరాబాద్‌లో కలిపేస్తారా?' అని ప్రశ్నించారు.
ఏదైనా సమస్య ఉంటే.. చర్చించుకోవాలి, కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు మంత్రి బోత్స కౌంటర్ వేశారు. ముందుగా తన జిల్లా సంగతి చూసుకోవాలని సూచించారు. వందేళ్ల తర్వాత.. గోదావరికి ఇంత వరద వచ్చిందన్నారు. ఈ విషయంలో ఎవరైనా బాధ్యతగా మాట్లాడాలని, విలీన ప్రక్రియ కేంద్రం పరిధిలోని అంశమని అన్నారు.
పోలవరం నిర్మాణంలో ఎలాంటి మార్పులు లేవనీ, గతంలో అమోదించిన డిజైన్ల ప్రకారమే నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. గతంలా ఉమ్మడి రాష్ట్రంగా ఉండే బాగుంటుందని అడిగితే ఎలా ఉంది? ఒకవేళ అలా చేయాలని ఉంటే.. అలానే చేసేయమనండి అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉండటంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. గోదావరి ముంపు మండలాలు ప్రజల బాధ్యతను ఏపీ ప్రభుత్వం చూసుకుంటుందనీ, విలీన మండలాలను తెలంగాణలో కలిపేయాలని డిమాండ్ చేస్తే.. రాష్ట్రాన్ని మళ్లీ కలిపేయాలని డిమాండ్ చేస్తామని మంత్రి బోత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు.
