Asianet News TeluguAsianet News Telugu

బేగంబజార్‌ పరువు హత్య.. అటువైపు రావొద్దని చెప్పిన సంజన తల్లి.. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు..

హైదరాబాద్ బేగంబజార్‌లో చోటుచేసుకున్న పరువు హత్య కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. నీరజ్ హత్యకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు బయటపడ్డాయి.

begum bazar neeraj murder case Key things in remand report
Author
Hyderabad, First Published May 23, 2022, 10:08 AM IST

హైదరాబాద్ బేగంబజార్‌లో చోటుచేసుకున్న పరువు హత్య కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. నీరజ్ హత్యకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు బయటపడ్డాయి. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం.. రువు పోవడంతో పాటు అవమాన భారంతోనే నీరజ్‌ను హత్య చేసినట్టుగా నిందితులు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. సంజనతో పెళ్లి, బాబు పుట్టిన తర్వాత యాదవ అహీర్ సమాజ్‌కు చెందిన వ్యక్తులతో నీరజ్ రెచ్చగొట్టే వాఖ్యలు చేసినట్టు నిందితులు తెలిపారు. ఈ  క్రమంలోనే యాదవ అహీర్ సమాజ్‌లోని కార్యక్రమాలకు సంజన కుటుంబ సభ్యులను పిలవని పరిస్థితులు ఏర్పడ్డాయి. 

సంజన ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవడంతో.. ఎక్కడికి వెళ్ళినా ఆమె కుటుంబ సభ్యులు అవమాన భారంతో కుంగిపోయారు. అయితే గతేడాది ఏప్రిల్‌లో సంజనకు కుటుంబ సభ్యులు మరో అబ్బాయితో ఆమెకు నిశ్చితార్థం చేశారు. పెళ్లికి మూడు నెలల ముందు ఇంట్లో నుంచి పారిపోయిన సంజన.. నీరజ్‌ను పెళ్లి చేసుకుంది. 

అయితే బాబు పుట్టిన తర్వాత సంజన.. తన తల్లితో మాట్లాడింది. అయితే ఈ సందర్భంలో బేగంబజార్ రావొద్దని సంజనను ఆమె తల్లి హెచ్చరించింది. అయితే తల్లి హెచ్చరికను లెక్కచేయకుండా సంజన, ఆమె భర్త నీరజ్ బేగంబజార్‌లోనే నివాసం ఉంటున్నారు. మరోవైపు నిందితులు ఎలాగైనా నీరజ్‌ను హత్య చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఇందుకోసం గురవారం నిందుతులు జుమేరాత్ బజార్‌లో కత్తులు, రాడ్లు కొన్నారు. శుక్రవారం రాత్రి నీరజ్ కోసం ఒక బాలుడితో నిందితులు రెక్కీ నిర్వహించారు. తన తాతతో కలిసి బైక్‌పై వెళుతున్న నీరజ్ కంట్లో కారం చల్లిన నిందితులు ఆపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఘటనకు ముందు నిందితులు పీకల దాకా మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. 

అసలేం జరిగింది..
బేగంబజార్ కోల్సావాడి ప్రాంతానికి చెందిన నీరజ్ పన్వర్ పల్లీల వ్యాపారం చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన సంజనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నెల క్రితం బాబు పుట్టాడు. అయితే సంజనను పెళ్లి చేసుకన్న నీరజ్‌పై  ఆమె కుటుంబ సభ్యుల కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రంగా సంజన సోదరులు, వారి స్నేహితులు.. నీరజ్‌ తన తాతయ్యతో కలిసి బైక్‌పై బంధువుల ఇంటికి వెళ్తుండగా యాదగిరి గల్లి, చేపల మార్కెట్ వద్ద అతడిని ఆపి కత్తులు, బండరాళ్లతో దాడికి పాల్పడ్డారు.  తీవ్ర రక్తస్రావానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నీరజ్ మృతిచెందాడు. 

ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు నలుగురిని  అరెస్ట్ చేశారు. వారిలో విజయ్ యాదవ్, సంజయ్‌ యాదవ్‌తో పాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. వీరిని ఆదివారం సాయంత్రం 16వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి ఇంట్లో హాజరుపరచగా.. రిమాండ్ విధించాడు. దీంతో ఇద్దరు నిందితులను చంచల్‌గూడ జైలుకు, మైనర్లను జువైనల్ హోంకు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు అభినందన్ యాదవ్, మహేష్ యాదవ్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మరోవైపు తనకు, తన బిడ్డకు ప్రాణహాని ఉందని సంజన ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు భద్రత కల్పించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios