బీసీ ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు ముహూర్తం ఫిక్స్.. దసరాకు ప్రారంభమవ్వాలి: 32 బీసీ కుల సంఘాలతో మంత్రి గంగుల
ఈ రోజు మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్‌లో 32 బీసీ కుల సంఘాల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. బీసీ ఆత్మ గౌరవ భవనాల నిర్మాణాలకు ఈ భేటీలో ముహూర్తం ఫిక్స్ అయింది. కోకాపేట్‌లో ఫిబ్రవరి 5న, ఉప్పల్ భగాయత్, పిర్జాదిగూడలో 6న ముహూర్తం ఫిక్స్ అయినట్టు ఓ ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ భవనాల నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. పలుమార్లు బీసీ సంఘాలతో సమావేశమై.. 32 బీసీ కులాలను ఏకతాటిమీదికి తెచ్చిన ప్రభుత్వం ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఫిబ్రవరి 5న కోకాపేట్‌లో, 6వ తేదీన ఉప్పల్ భగాయత్, పిర్జాదిగూడలో ఆయా సంఘాలతో సామూహిక భూమి పూజలు నిర్వహిస్తామని తాజాగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ గంగుల కమలాకర్ అన్నారు. హైదరాబాద్ దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో 32 బీసీ కుల సంఘాల ప్రతినిధులతో ఆయన ఈ రోజు సమావేశమయ్యారు.
ఏ సీఎం చేయని విధంగా 41 బీసీ కులాల ఆత్మగౌరవం కోసం కేసీఆర్ ఎంతో విలువైన జాగలను కేటాయించారని, వాటికి నిధులనే కాదు, ఆయా కులాల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా భవనాలను నిర్మించుకునే అవకాశాన్ని కుల సంఘాలకు కల్పించారని మంత్రి అన్నారు. ఆర్డర్లు పొందిన ప్రతి ఏక సంఘం మార్చి 31వ తేదీ లోగా స్లాబులు పూర్తి చేయాలని సూచించారు. ఇక అనుమతి పత్రాలు పొందినా గడువులోగా నిర్మాణాలకు ఏ బీసీ కులుమైనా ముందుకు రాకపోతే ప్రభుత్వమే నిర్మించి పెడుతుందని తెలిపారు. అన్ని బీసీ ఆత్మగౌరవ భవనాలు దసరా పండుగకు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ భవనాల్లో కళ్యాణ వేదికలు, సమావేశ మందిరాలు, విద్యార్థులకు హాస్టళ్లు, రిక్రియేషన్ వంటి అన్ని సదుపాయాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
Also Read: కరీంనగర్ చేరుకున్న సీఎం కేసీఆర్.. మంత్రి గంగుల కమలాకర్‌కు పరామర్శ..
వేల కోట్ల విలువైన 87.3 ఎకరాలను 41 బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
భవనాల ప్రాంగణాల్లో రోడ్లు, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని, ఇందుకోసం ఉన్నతాధికారులతోపాటు హెచ్ఎండీఏ, విద్యుత్, వాటర్ వర్క్స్, ఆర్ అండ్ బీ తదితర శాఖలను సమన్వయపరిచి సకాలంలో పనులు పూర్తి చేసేలా వెంటనే అడ్ హాక్ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల ప్రతినిధులతోపాటు ఎమ్మెల్యే ముఠాగోపాల్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, బీసీ సంక్షేమ శాఖ సెక్రెటరీ బుర్రా వెంకటేశం, సమా ఇతర అధికారులు పాల్గొన్నారు.