జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను దేశంలో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీకి, హైదరాబాద్ నగరానికి ఉన్న సంబంధాన్ని గుర్తు  చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనలో  చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే...గాంధీ అస్తికలను ఇక్కడ కలిపారు. మీరు చదివింది నిజమే. గాంధీ అస్తికలను దేశంలోని 11స్థానాల్లో కలపగా... అందులో హైదరాబాద్ కూడా ఉంది. 

మహాత్మాగాంధీ 1948లో మరణించిన తర్వాత ఫిబ్రవరి 12న ఆయన అస్తికలను లంగర్‌హౌజ్‌లోని ఈసీ, మూసీ నదుల సంగమంలో కలిపారు. ఈ ప్రదేశంలో కలిపితే అస్తికలు రాళ్లుగా ఏర్పడతాయన్న చారిత్రక నేపథ్యాన్ని గుర్తించిన అప్పటి గాంధేయవాది జ్ఞానకుమారి హెడా ఇక్కడికి గాంధీ అస్తికలను తీసుకొచ్చారు. దీంతో నాటి ప్రభుత్వం నగరంలోని లంగర్‌హౌజ్‌లో ఈసీ, మూసీ నదుల ఒడ్డున గాంధీ సమాధి నిర్మించింది. దానినే ఇప్పుడు మనం బాపూ ఘాట్ గా పిలుచుకుంటున్నాం.

అంతేకాకుండా... ప్రత్యేకంగా బాపు జ్ఞాన మందిరాన్ని కూడా ఏర్పాటు  చేశారు.  2 ఎకరాల స్థలంలో దాదాపు 900 మంది విద్యార్థులు కూర్చునేందుకు వీలుగా నిర్మించారు. జ్ఞాన మందిరం నుంచి 200 మీటర్లు దూరంలో ఉన్న బాపూ సమాధికి వెళ్లే మార్గాన్ని అభివృద్ధి చేశారు. గ్రంథాలయం, గాంధీ చరిత్రకు సంబంధించిన పలు చిత్రపటాలను ఏర్పాటు చేసేందుకు పక్కనే మరో భవనాన్ని కూడా నిర్మించారు. 

గాంధీ మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేశారు.   జ్ఞాన మందిరంలోని కొద్ది ప్రాంతంలో ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు. అందులో గాంధీ చరిత్రకు సంబంధించిన ఫోటోలను ఏర్పాటు చేశారు. కాగా.... ప్రస్తుతం బాపూఘాట్ ని ఓ ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలను గాంధేయవాదులు ఎప్పటి నుంచో కోరుతున్నారు.  ఈ ప్రాంతాన్ని గుజరాత్ లోని సబర్మతీ ఆశ్రమంలాగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే పలు మార్లు ప్రభుత్వాలకు వినతిపత్రాలను కూడా అందజేశారు.