భార్యపై అనుమానంతో ఓ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ దారుణానికి పాల్పడ్డాడు. భార్యని హత్యచేసి ఆ తర్వాత తాను కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

నల్లంకుంటలోని సిండికేట్ బ్యాంకులో మాధవ్ అనే వ్యక్తి అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అతడికి గత ఎనిమిది నెలల క్రితమే వివాహం జరిగింది. అయితే తన భార్య మరెవరితోనే అక్రమసంబంధం పెట్టుకుందని మాధవ్ నిత్యం అనుమానించేవాడు. ఆమెను మానసికంగా హింసించేవాడు. దీంతో విసుగుచెందిన యువతి కొద్దిరోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది.

ఇటీవల మాధవ్ అత్తవారింటికి వెళ్లి భార్యను తనతో పాటు ఇంటికి తీసుకువచ్చాడు. అతడు మారాడని భావించి ఆమె కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా అతడితో పాటు వచ్చింది. అయితే ప్లాన్ ప్రకారం భార్యను ఇంటికి తీసుకువచ్చిన మాధవ్ ఆమెను అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత తాను కూడా వెళ్లి ఎంఎంటీఎస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

విషయం తెలుసుకున్న నల్లకుంట పోలీసులు ఇద్దరు భార్యా భర్తల మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.