తానొక టాప్ డైరెక్టర్ పీఏ అని.. తాను తలుచుకుంటే హీరోయిన్ ఛాన్స్ సులభంగా ఇప్పించగలనని చెబుతూ.. ఓ యువకుడు అమ్మాయిలకు వల విసిరాడు. ఎంతో మంది అమ్మాయిలను ఇలాంటి మాయమాటలు చెప్పి మోసం చేసిన యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లోని భగత్‌సింగ్‌ కాలనీలో నివసించే మణికంఠ సాయి (25) అనే యువకుడు ఓ అగ్ర దర్శకుడి పీఏనంటూ స్థానికంగా నివాసముండే  కీర్తిపల్లి సత్యనారాయణశర్మతో పరిచయం పెంచుకున్నాడు. తనకు బ్యాంకుల్లో బాగా పరిచయాలున్నాయని, రుణం కావాలంటే ఇప్పిస్తానంటూ కీర్తిపల్లి సత్యనారాయణశర్మ వద్ద రూ.60 వేలు తీసుకున్నాడు. తరచూ అతడి ఇంటికెళ్లి ఆయన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇటీవల కాలంలో అతడి భార్య కూడా మణికంఠ ఉచ్చులో ఇరుక్కుంది.

ఆమెతో ఉన్న సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతానంటూ మణికంఠ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. తనపై ఫిర్యాదు చేస్తే భార్యను చంపడమే కాకుండా ఇద్దరి కొడుకులను కూడా అంతం చేస్తానంటూ బెదిరించసాగాడు. తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడమే కాకుండా భార్యను తనకు దూరం చేశాడని  కీర్తిపల్లి సత్యనారాయణశర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మణికంఠపై ఐపీసీ సెక్షన్‌ 354(ఏ), 497, 509 కింద కేసులు నమోదు చేశారు. 

ఇదిలా ఉండగా తాను ఓ అగ్రదర్శకుడి వద్ద పీఏగా పని చేస్తున్నానని సినిమాల్లో చాన్స్‌ ఇప్పిస్తానంటూ స్థానికంగా చాలా మంది యువతులను వలలో వేసుకున్నాడని, అందినకాడికి డబ్బులు వసూలు చేశాడని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. యువతులతో శారీరకవాంఛ తీర్చుకునే క్రమంలో, వారికి తెలియకుండా వీడియోలు తీసి తనపై ఫిర్యాదు చేస్తే ఆ వీడియో సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నాడన్నాడు. సినిమాల మీద మోజుతో మణికంఠను నమ్ముకొని వచ్చిన యువతులు సర్వం కోల్పోయారని వెల్లడించాడు. బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.