కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపాయి. దీంతో తెలంగాణ బిజెపి అధ్యక్ష మార్పుపై ప్రచారం జరుగుతున్న ప్రచారంపై తరుణ్ చుగ్ స్పందించారు.  

హైదరాబాద్ : తెలంగాణ బిజెపి నాయకుల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయని... అందువల్లే రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలని అదిష్టానం భావిస్తోందంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్ స్థానంలో ఈటల రాజేందర్ లేదా డికె అరుణకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించవచ్చని ప్రచారం జరిగుతోంది. ఈ ప్రచారానికి తెరదించుతూ రాష్ట్ర బిజెపి వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. 

తెలంగాణలో రోజురోజుకు మరింత బలపడుతున్న బిజెపిని బలహీనపర్చాలనే నాయకుల మధ్య విబేధాలు, అధ్యక్ష మార్పు అంటూ ప్రత్యర్ధి పార్టీలు ఏవేవో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని తరుణ్ చుగ్ అన్నారు. బిజెపి నాయకుల మధ్య ఎలాంటి విబేధాలు లేవని... అందరూ ఒకేతాటిపై వున్నారని అన్నారు. తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే ప్రతి ఒక్క నాయకుడి లక్ష్యం... ఆ దిశగానే అధ్యక్షుడి నుండి సామాన్య కార్యకర్త వరకు పనిచేస్తున్నారని తరుణ్ చుగ్ అన్నారు. 

బిజెపి రాష్ట్రాధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతారని తరుణ్ చుగ్ స్పష్టం చేసారు. ఇప్పటికే సంజయ్ ఆధ్వర్యంలోనే రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నియామకం జరిగింది... ఇక అధ్యక్షుడి ప్రస్తావన ఎక్కడిదని తరుణ్ చుగ్ అన్నారు. 

Read More మరోసారి బాంబు పేల్చిన బండి సంజయ్.. త్వరలో ఆ 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి..?

సంజయ్ నేతృత్వంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి బరిలోకి దిగుతుందని ఇప్పటికే బిజెపి అధినాయకత్వం స్పష్టం చేసింది. అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో బిజెపి కాస్త డీలా పడటంతో అధ్యక్ష మార్పు ప్రచారం ప్రారంభమయ్యింది. సంజయ్ నాయకత్వంలో పనిచేసేందుకు సీనియర్లు విముఖంగా వున్నారని... ఆయన స్థానంలో రాజకీయంగా సుదీర్ఘ అనుభవం వున్న ఈటల, డికె అరుణ వంటివారిని నియమించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై స్పందించిన తరుణ్ చుగ్ అధ్యక్ష మార్పు వుండదంటూ క్లారిటీ ఇచ్చారు. 

ఇక ఇప్పటికే తెలంగాణ బిజెపి అధ్యక్షున్ని మార్చనున్నారంటూ జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని బండి సంజయ్ స్ఫష్టం చేసారు. ఇతర పార్టీలు చేసే ఈ ప్రచారాన్ని బిజెపి క్యాడర్ నమ్మవద్దని సూచించారు. ఏదయినా వుంటే బిజెపి పెద్దలే స్వయంగా ప్రకటిస్తారని అన్నారు. పార్టీ లైన్ లోనే వుంటూ బిజెపి బలోపేతానికి పనిచేస్తున్నానని... పార్టీ జాతీయాధ్యక్షుడి ఆదేశాలకు కట్టుబడి పనిచేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. 

తనను రాష్ట్ర అధ్యక్ష పదవినుండి తొలగించి కేంద్ర మంత్రిని చేస్తారంటూ ప్రచారం జరుగుతోందని బండి సంజయ్ అన్నారు. బిజెపిని బలహీనపర్చేందుకు జరుగుతున్న కుట్రల్లో భాగమే ఈ ప్రచారమని అన్నారు. బిజెపి అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు ముందుగానే లీకయ్యే అవకాశాలు వుండవని... గతంలో ఎప్పుడూ ఇలా జరిగిన దాఖలాలు లేవన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా బిజెపి నుండి లీకులు లేవని సంజయ్ అన్నారు.